Begin typing your search above and press return to search.

ఆ దేశాన్ని ఏదో ఒక‌టి చేసేయాలంటున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   6 July 2017 11:31 AM GMT
ఆ దేశాన్ని ఏదో ఒక‌టి చేసేయాలంటున్న ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు ఆగ్ర‌హం రూపం దాల్చారు. పోలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ట్రంప్‌ ఇటీవ‌ల ఖండాంత‌ర క్షిప‌ణి ప్ర‌యోగించిన నార్త్ కొరియాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నార్త్ కొరియా చాలా ప్ర‌మాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని - వాళ్ల ప్ర‌వ‌ర్త‌న సిగ్గు చేటుగా ఉంద‌ని, దాన్ని అడ్డుకునేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పోలాండ్ అధ్య‌క్షుడు ఆండ్రెజే డుడాతో క‌లిసి ప్ర‌త్యేక మీడియా స‌మావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. నార్త్ కొరియాపై సైనిక చ‌ర్య‌కు దిగుతారా అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ కొన్ని క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ట్రంప్ అన్నారు.

కాగా, ఉత్తర కొరియా రూపొందించిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి అలస్కాను చేరుకోగలదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమతి భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ క్షిపణి ప్రయోగంపై ఇప్పటికే అమెరికా - జపాన్ - దక్షిణ కొరియా నిరసన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ కూడా క్షిపణి పరీక్షలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై సీరియస్‌ గా ఉన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో యూఎస్ ప్రతినిధి నిక్కీ హేలీ చైనా రాయబారితో మాట్లాడారు.

తాము రూపొందించిన మొట్టమొదటి దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వసాంగ్-14 భారీ అణ్వస్ర్తాలనూ మోసుకెళ్లగలదని, భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించగల సామర్థ్యం దానికి ఉందని ఉత్తరకొరియా వెల్లడించింది. ఉత్తరకొరియా మంగళవారం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అమెరికాలోని అలస్కా రాష్ర్టాన్నీ చేరుకోగలదని నిపుణులు అంచనావేస్తుండగా, ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ అదే విషయాన్ని ధ్రువీకరించింది. హ్వసాంగ్-14 క్షిపణి ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ``అమెరికన్ బాస్టర్డ్స్ ఇక సంతోషంగా ఉండలేరేమో. ఇది వారికి జూలై4 స్వాతంత్య్ర దినోత్సవ కానుక`` అని వ్యాఖ్యానించారు. 25 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా క్షిపణి ముఖం స్థిరంగా ఉంటుందని, హ్వసాంగ్-14 సుదీర్ఘ లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తుందని తెలిపింది. ఇక మనకు బోర్ కొట్టినప్పుడల్లా అమెరికాకు ఇలా బహుమతులు పంపవచ్చు అని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొన్నది.

అమెరికాతో ఉత్తరకొరియాకు సుదీర్ఘంగా ఉన్న వైరం తుది దశకు చేరుకుందని తాజా పరిణామాలపై అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గబోము. చర్చల కోసం ఖండాంతర క్షిపణులను పక్కనబెట్టే ప్రసక్తే లేదు అని కిమ్‌జోంగ్ ఉన్ చెప్పారని కేసీఎన్‌ఏ పేర్కొనడం గమనార్హం. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షపై ఆందోళన వ్యక్తంచేసిన అమెరికా, దక్షిణ కొరియా బుధవారం తమ క్షిపణులతో సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి. ఉత్తర కొరియాకు గట్టి హెచ్చరిక పంపేందుకు ఈ డ్రిల్‌ ను నిర్వహించినట్లు దక్షిణ కొరియా అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఉత్తర కొరియాకు గట్టి హెచ్చరిక పంపాలనుకున్నాం. అందుకే సంయుక్త యుద్ధవిన్యాసాలను నిర్వహించాం అని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ వెల్లడించారు.