Begin typing your search above and press return to search.

అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ట్రంప్ క‌త్తి ఎక్కుపెట్టేశారు

By:  Tupaki Desk   |   12 Feb 2017 9:42 AM GMT
అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ట్రంప్ క‌త్తి ఎక్కుపెట్టేశారు
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న వివాదాస్ప‌ద ఎన్నిక‌ల వాగ్దానాల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వెళ్తున్నారు. ముందు మెక్సికో గోడ‌.. త‌ర్వాత ఏడు ముస్లిం దేశాల వ‌ల‌స‌దారుల‌పై నిషేధం.. తాజాగా దేశంలోని అక్ర‌మ వ‌ల‌స‌దారుల వేట‌. అక్ర‌మ వ‌ల‌స‌దారులపై ఉక్కుపాదం మోప‌డానికి సిద్ధ‌మైన అమెరికా అధికారులు.. గ‌త వారం వంద‌ల మందిని అరెస్ట్ చేశారు. దీంతో దేశ‌వ్యాప్తంగా స‌రైన ప‌త్రాలు లేకుండా ఉన్న వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌, న్యూయార్క్‌, షికాగో, ఆస్టిన్‌, అట్లాంటాలాంటి న‌గ‌రాల్లో ఇమ్మిగ్రేష‌న్ అండ్ క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు సోదాలు నిర్వ‌హించారు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌రిమేయాల్సిందిగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌పై సంత‌కాలు చేసిన రెండు వారాల త‌ర్వాత అధికారులు వేట మొద‌లుపెట్టారు. అయితే ఐసీఈ అధికారులు మాత్రం ఇవి రొటీన్‌గా నిర్వ‌హించే దాడులేన‌ని అంటున్నారు.

కాలిఫోర్నియా మొట్రోపొలిస్‌లో 160 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఐసీఈ అధికారి డేవిడ్ మారిన్ వెల్ల‌డించారు. శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కే వీరిలో 37 మందిని మెక్సికోకు గెంటేశారు. దేశంలో కోటి ప‌ది ల‌క్ష‌ల మంది అక్ర‌మ వ‌ల‌స‌దారులు ఉన్న‌ట్లు ట్రంప్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌ర‌చూ చెప్పేవారు. ప‌నిచేసే ప్రాంతాలు, ఇళ్ల‌పై జ‌రుగుతున్న ఈ దాడుల‌పై నిర‌స‌న‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఎన్నికైన కాలిఫోర్నియాలో ఈ నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఇక్క‌డే సుమారు పది ల‌క్షల మంది అక్ర‌మ వ‌ల‌సదారులు ఉన్న‌ట్లు ప్యూ రీసెర్చ్ సెంట‌ర్ అంచ‌నా వేసింది. మన విలువ‌ల‌ను దిగ‌జార్చేలా ట్రంప్ విధానాలు ఉన్నాయ‌ని డెమొక్ర‌టిక్ సెనేట‌ర్ డియానె ఫీన్‌స్టీన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.