Begin typing your search above and press return to search.

మరోసారి ట్రంప్ ‘చంపుడు’ మాట

By:  Tupaki Desk   |   11 Sep 2016 5:40 AM GMT
మరోసారి ట్రంప్ ‘చంపుడు’ మాట
X
తన కంపు మాటలతో తరచూ వివాదాల్లో ఉండే డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ తరహాలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తరచూ వివాదాలకు తెర తీసేలా మాట్లాడుతుంటారు. అమెరికన్ల ప్రాణం ఎంత విలువైనదో చెప్పే పెద్దన్న వైఖరికి భిన్నంగా ట్రంప్ నోట చంపుడు మాటలు తరచూ వస్తుంటాయి.

తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తల్లో ఆయన చంపుడు మాటల్ని చాలా సులువుగా చెప్పేశారు. ఫిఫ్త్ ఎవెన్యూ మధ్యలో నిలబడి తాను ఎవరినైనా చంపినా.. తన ఓటర్లు ఎక్కడికి పోరంటూ ఆయన తీవ్ర వివాదాన్ని రేపే వ్యాఖ్యల్ని చేశారు. ఇప్పుడదే వ్యాఖ్యల్ని కాస్త మార్చి ప్రత్యర్థిని ఇరుకున పడేసేందుకు వాడటం విశేషం.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. తన మాటల్లో మసాలాను పెంచిన ట్రంప్.. తన రాజకీయ ప్రత్యర్థి.. డెమొక్రాట్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. హిల్లరీ క్లింటన్ కు పూర్తి రక్షణ ఉందని.. 20వేల మంది చూస్తుండగానే ఆమె ఎవరినైనా చంపేసినా ఎలాంటి విచారణ ఎదుర్కొనకుండా తప్పించుకోగలరంటూ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలో ఈ తరహా పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి చూస్తానని తాను ఎప్పుడూ అనుకోలేన్న ట్రంప్ వ్యాఖ్యల్ని చూస్తే.. తాను కానీ.. హిల్లరీ కానీ ఎవరినైనా.. ఏమైనా చేసేస్తామన్న మాటను చెప్పేశారు. ఈ తరహా నేతలు దేశానికి అధ్యక్షులు అయితే.. అమెరికా సంగతే కాదు.. ప్రపంచం సంగతేంటన్నది ప్రశ్న. పెద్దన్న హోదా కుర్చీలో కూర్చోవాలని తహతహలాడే నేత నోటి నుంచి తరచూ ‘చంపుడు’ మాటలు రావటం ఏందో..?