Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బ‌కు విల‌విల‌లాడుతోన్న పాకిస్థాన్‌

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:22 AM GMT
ట్రంప్ దెబ్బ‌కు విల‌విల‌లాడుతోన్న పాకిస్థాన్‌
X
ట్రంప్ అంటే ట్రంపే. ఆ మాట‌లో వేరే మాటే లేదు. తన నోటి నుంచి మాట వ‌చ్చిందంటే.. దాని ప్ర‌భావం వెనువెంట‌నే ఉంటుంద‌న్న విష‌యాన్ని తాజా చ‌ర్య‌ల‌తో తేల్చేశాడు. దాయాది పాకిస్థాన్ దుష్ట‌బుద్ధి గురించి అగ్ర‌రాజ్యానికి తెలిసినా.. చాలా లెక్క‌ల్లో భాగంగా ఆ దేశంపై క‌న్నెర్ర చేయ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డేది కాదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఎప్ప‌టిక‌ప్పుడే వేల కోట్ల రూపాయిల్ని సాయంగా అందించేది.

ఎందుకిలా అంటే.. చైనాను కంట్రోల్ చేయ‌టానికి వీలుగా పాక్ లో త‌మ అడ్డా ఒకటి సిద్ధంగా ఉంచుకోవ‌టం కోసం అమెరికా పెడుతున్న ఖ‌ర్చు అంతా ఇంతా కాదు. అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయిల్ని సాయంగా ఇస్తుంటే.. పాక్ మాత్రం త‌మ దేశాన్ని ఉగ్ర‌వాదుల అడ్డాగా మార్చేస్తోంది. దీనిపై ఆగ్ర‌హించిన ట్రంప్‌.. మేం మీద‌కు డ‌బ్బులు సాయంగా ఇస్తుంటే.. మీరు మాత్రం మా మీద దాడుల‌కు ఉగ్ర‌వాదుల్ని త‌యారు చేసేందుకు వీలుగా వేదిక‌ల‌కు అవ‌కాశం ఇస్తారా? అంటూ ఆగ్ర‌హించ‌ట‌మే కాదు.. ప‌దిహేనేళ్లుగా ఈ ఆట సాగుతోందంటూ పాక్ నిజ‌స్వ‌రూపాన్ని ఓపెన్ గా చెప్పేసి సంచ‌ల‌నం సృష్టించారు.

అంతేనా.. ఉగ్ర‌వాద స్థావ‌రాల విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోకుంటే.. తాము ఇవ్వాల్సిన సైనిక సాయాన్ని నిలిపివేస్తామంటూ పాక్ కు గుండెలు అదిరే మాట‌ను చెప్ప‌టేమే కాదు.. 2017లో ఇస్తామ‌న్న రూ.1700 కోట్ల‌ను నిలిపివేశాడు. ఏదో మాట‌ల వ‌ర‌కైతే పాక్ లైట్ తీసుకునేది. ఇప్పుడేమో ఏకంగా భారీగా నిధులు ఆపేయ‌టంతో పాక్ కిందామీదా ప‌డుతోంది.

త‌మ ఆర్థిక అవ‌స‌రాల్ని తీర్చే సాయాన్ని నిలిపివేయ‌టంతో ట్రంప్ పై మండిప‌డ‌టం షురూ చేసింది. తాము ఇస్తామ‌న్న రూ.1700 కోట్లు కావాలంటే దేశంలోని ఉగ్ర‌వాద స్థావ‌రాల మీద చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ట్రంప్ స‌ర్కారు టార్గెట్ పెట్ట‌టంతో పాక్ తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక‌వైపు సాయాన్ని వ‌ద్ద‌ని చెప్ప‌లేని దీన స్థితి.. మ‌రోవైపు ఉగ్ర‌క్యాంపుల్ని ఎత్తేయించే ధైర్యం చేయ‌లేక కిందామీదా ప‌డుతోంది.

దీంతో.. అగ్ర‌రాజ్యంపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించ‌టం షురూ చేసింది పాక్‌. ట్రంప్ స‌ర్కారు తీరు కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య‌నున్న స్నేహ సంబంధాలు.. ప‌ర‌స్ప‌ర విశ్వాసాల్ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు దెబ్బ తీసాయంటూ ఫైర్ అయ్యారు. ఉగ్ర‌వాదంపై పోరుకు అమెరికా అన్ని విధాలుగా సాయం చేస్తుంద‌న్నారు. తమ భూభాగాన్ని.. గ‌గ‌న‌త‌లాన్ని.. స‌మాచార వ్య‌వ‌స్థ‌ను.. సైనిక స్థావ‌రాల్ని అగ్ర‌రాజ్యానికి అందుబాటులో ఉంచామ‌న్న విష‌యాన్ని గుర్తు చేసింది.

పాక్ మాట‌లు చూస్తే.. మేం ఇన్ని చేసినా.. మీరు మాత్రం మ‌మ్మ‌ల్ని ఏదో ఒక‌టి అంటూనే ఉంటున్నారే అంటూ ఆవేద‌న స్వ‌రంతో ఆక్రోశిస్తోంది. ఏం చెప్పినా.. ఎంత ఏడ్చినా నిధులు కావాలంటే.. ఉగ్ర‌క్యాంపుల‌పై ఉక్కుపాదం మోపాలంటూ ట్రంప్ స‌ర్కారు తేల్చేస్తున్న నేప‌థ్యంలో ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలో పాక్ కిందామీదా ప‌డుతోంది.