Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు ఇంకో షాక్ త‌గిలింది

By:  Tupaki Desk   |   19 Oct 2017 6:46 AM GMT
ట్రంప్‌ కు ఇంకో షాక్ త‌గిలింది
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు హవాయి ఫెడరల్‌ కోర్టు షాకిచ్చింది. ఆరు దేశాలకు ( ఇరాన్‌ - లిబియా - సోమాలియా - చాడ్‌ - సిరియా - యెమెన్‌) చెందిన ముస్లిం పౌరులను అమెరికాలో నిషేధించాలని ట్రంప్‌ గతనెల 24న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, హవాయికి చెందిన ముస్లిం సంఘాల ప్రతినిధులు ట్రంప్‌ ఆదేశాలను కోర్టులో సవాలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన యూఎస్‌ జిల్లా కోర్టు ఆరు ముస్లిం దేశాల పౌరులపై ఉన్న నిషేధాజ్ఞలపై స్టే విధించింది.

ఇతర దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించే హక్కు దేశాధ్యక్షుడికి లేదని జస్టిస్‌ డెర్రిక్‌ వాట్సన్‌ స్పష్టం చేశారు. అయితే, ఉత్తర కొరియా పౌరులపై - వెనిజులా ప్రభుత్వ అధికారులపై ట్రావెల్‌ బ్యాన్‌ ను కొనసాగించొచ్చని ట్రంప్‌ సర్కార్‌ ను సూచించారు. ట్రావెల్‌ బ్యాన్‌ ఆదేశాలు ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను తుంగలో తొక్కేలా ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ ఆదేశాలతో దాదాపు 15 కోట్ల మంది విదేశీయులు ఇబ్బందులు పడే ప్రమాదముందన్నారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ముస్లిం ప్రవేశాలను అడ్డుకోవడం అనైతికమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈకేసులో అమెరికా ప్రభుత్వం సరైన కారణాలు చూపలేకపోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రావెల్‌ బ్యాన్‌ పై ట్రంప్‌ గతంలో జారీ చేసిన ఆదేశాలపై అమెరికా కోర్టులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో,కొత్త మార్పులతో గతనెల24న ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ ను తీసుకొచ్చారు. అయితే, దానిని కూడా యూఎస్‌ జిల్లా జడ్జీ డెర్రిక్‌ వాట్సన్‌ నిలిపేయాలని మరోసారి ఆదేశించారు. తాజాగా వెలువడిన తీర్పు నేపథ్యంలో ట్రంప్‌ విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది.