Begin typing your search above and press return to search.

చెత్త మీడియా అవార్డులు ఇస్తానంటున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   4 Jan 2018 4:10 AM GMT
చెత్త మీడియా అవార్డులు ఇస్తానంటున్న ట్రంప్‌
X
"నేను మాటంటే మాటే. అస్స‌లు మ‌ర్చిపోను" అన్న‌ట్లుగా ఉంది అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హారం. త‌న త‌ప్పుల్ని ఎత్తి చేపించే వారిపై తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసే ట్రంప్ కు అమెరిక‌న్ మీడియాతో పెద్ద పంచాయితీనే ఉంది. బ‌డా బ‌డా మీడియా సంస్థ‌లు ఆయ‌న తీరును త‌ప్పు ప‌డుతుంటాయి. ఆయ‌న నిర్ణ‌యాల్ని ఏకిపారేస్తుంటాయి. ట్రంప్ వైఖ‌రి ప్ర‌జాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాద‌న్న మాట‌ను చెబుతుంటాయి.

అయితే.. ఇదంతా త‌నంటే గిట్ట‌ని మీడియా చేసే విష ప్ర‌చారంగా ట్రంప్ కొట్టిపారేస్తుంటారు. అమెరికా అధ్య‌క్షుడి రేసులో రిప‌బ్లిక‌న్ల త‌ర‌ఫున బ‌రిలో దిగే నాటి నుంచి ట్రంప్ ను తీవ్రంగా విబేదించే మీడియా సంస్థ‌లు ఉన్నాయి. మ‌న‌కు మాదిరి.. ప‌వ‌ర్లోకి రాగానే రాజీ ప‌డిపోయే తీరులో అమెరికా మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రించటం లేదు. ఇది ట్రంప్ లాంటి పాల‌కుడికి మ‌రింత క‌ష్టంగా మారింది.

త‌న‌ను బ‌ద్నాం చేసే మీడియాను రివ‌ర్స్ గేర్ లో ఎదురుదాడిని షురూ చేశారు. మీడియాతో త‌న‌కున్న వైరంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు గొంతు విప్పిన ట్రంప్‌.. ఆ మ‌ధ్య‌న చెత్త మీడియా అవార్డుల్ని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. ఏదో మాట వ‌ర‌స‌కు అన్నార‌నుకుంటే.. ఇప్పుడు ఆ మాట‌ను మ‌రోసారి గుర్తు చేయ‌ట‌మే కాదు.. గ‌డువు తేదీని ప్ర‌క‌టించేశారు.

అత్యంత క‌ప‌ట‌.. అవినీతి మీడియా అవార్డుల్ని తాను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా ట్రంప్ వెల్ల‌డించారు. తాజాగా ట్విట్ట‌ర్ లో ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. గ‌త ఏడాదికి సంబంధించి అత్యంత చెత్త మీడియా అవార్డుల్ని వ‌చ్చే సోమ‌వారం (జ‌న‌వ‌రి 8న‌) ప్ర‌క‌టిస్తాన‌ని పేర్కొన్నారు.

అబ‌ద్ధ‌పు వార్తా సంస్థ‌ల‌కు వివిధ విభాగాల్లో క‌ప‌ట‌త్వం.. చెత్త రిపోర్టింగ్‌కు ఈ అవార్డులు ఉంటాయ‌ని చెప్ప‌టం ద్వారా.. త‌న వ్య‌తిరేక మీడియాకు భారీ షాకిచ్చారు. కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్ ట్రోఫీ కోసం నామినేష‌న్ల పంపాలంటూ త‌న మ‌ద్ద‌తుదారుల‌కు ఈమొయిల్స్ పంపింది. అమెరిక‌న్ల‌ను తెలివిత‌క్కువ వాళ్లు అని కొంద‌రు జ‌ర్న‌లిస్టులు భావిస్తున్నార‌ని.. .. ప్ర‌జాభిప్రాయాన్ని తాము మార్చేయ‌గ‌ల‌మ‌ని అనుకుంటున్నారంటూ స‌ద‌రు మొయిల్ లో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాజా ట్వీట్ తో మీడియాతో త‌న‌కున్న పంచాయితీ ట్రంప్ మ‌రింత పెంచే దిశ‌గా అడుగులు వేస్తున్్న‌ట్లుగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న వారు మీడియాను ఏ తీరులో ఆడుకోవాల‌న్న అంశంపై ట్రంప్ స‌రికొత్త పోరు షురూ చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.