Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డుల జారీలో లాట‌రీ లేదు!

By:  Tupaki Desk   |   2 Nov 2017 11:10 AM GMT
గ్రీన్ కార్డుల జారీలో లాట‌రీ లేదు!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో గ్రీన్ కార్డు పొందేందుకు ఉన్న నిబంధ‌న‌లను స‌మూలంగా మార్చివేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న లాట‌రీ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ ప్ర‌తిపాదిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న రూల్స్ ప్ర‌కారం గ్రీన్ కార్డు పొంద‌డం సుల‌భ‌త‌రంగా ఉంద‌ని ట్రంప్ పేర్కొంటున్నారు. ఈ కార‌ణంగానే ఉగ్ర‌దాడులు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీంతో గ్రీన్ కార్డు ఇష్యూలో మ‌రిన్ని క‌ఠిన నిబంధ‌న‌లు తెచ్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

అమెరికా అధికారుల క‌థ‌నం మేర‌కు, వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని అధ్య‌క్షుడు ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌ కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌ కు చెందిన సైఫుల్లోగా గుర్తించిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయ‌డం గ‌మ‌నార్హం. గ్రీన్ కార్డు ఇచ్చేందుకు ఇప్పుడున్న వైవిధ్య లాటరీ విధానానికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాలు - గ్రీన్‌ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.

గ్రీన్ కార్డుల జారీ కోసం ప్రస్తుతం అవలంభిస్తున్న లాటరీ పథకాన్ని రద్దుకు సత్వరమే కార్యాచరణ మొదలుపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌ ను కోరతానని ట్రంప్ ప్రకటించారు.. అయితే వలస విధానాన్ని కఠినతరం చేయడంలో డెమోక్రటిక్‌ ప్రతినిధులు అడ్డుపడుతున్నారని ట్రంప్‌ దుయ్యబట్టారు. న్యూయార్క్‌ లో ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఆ దుండగుడికి మరణశిక్షే సరైనదని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అవసరమైతే నిందితుడిని గాంటెనామో బే కారాగారానికి పంపించాలని ట్రంప్‌ చెప్పారు.

అలాంటి వ్యక్తికి మరణశిక్ష విధించాల్సిందేనని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే, ఉగ్ర వాదుల ఏరివేతకు గ్రీన్ కార్డుకు ముడి పెట్ట‌డంపై మ‌రోసారి ట్రంప్ వివాదాస్ప‌ద‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు., ఉగ్ర‌వాదం పేరుతో గ్రీన్ కార్డు జారీకి ఇలా ప్ర‌తిభ నిబంధ‌న స‌మంజ‌సం కాద‌ని, దీనికి మ‌ద్ద‌తు ల‌భించ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఉగ్ర‌వాదాన్ని అంతమొందించేందుకు అనేక మార్గాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.