Begin typing your search above and press return to search.
ట్రంప్ ప్రమాణస్వీకారం..రెండు బైబిళ్లు..ఓ స్మశానం
By: Tupaki Desk | 19 Jan 2017 6:22 AM GMTఅమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది ఆయన అభిమానులు వాషింగ్టన్ కు చేరుకుంటున్నారు. దీంతో అమెరికా మొత్తం ట్రంప్ మానియాలో తేలియాడుతోంది. ట్రంప్ రెండు బైబిళ్లతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఉపయోగించిన బైబిల్ వాటిలో ఒకటి కాగా, ట్రంప్ చిన్నతనంలో ఆయనకు తల్లి బహూకరించిన బైబిల్ రెండవది. ట్రంప్ సండే చర్చి స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా 1955 జూన్ 12న న్యూయార్క్‌లోని ఫస్ట్ ప్రెస్ బెటిరియన్ చర్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తల్లి ఈ బైబిల్ ను ఆయనకు బహూకరించింది.
వాషింగ్టన్ లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లను ఎంతగానో అకట్టుకోవడమే కాకుండా ఆయన విజయం సాధించడానికి సైతం ప్రధాన అంశంగా ఉపయోగపడిన నినాదం ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మెయిన్ థీమ్ గా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు ప్రమాణస్వీకారానికి ముందురోజే గురువారం ప్రారంభం కానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడడానికి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో గద్దె దిగిపోతున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతా ఏర్పాట్ల సన్నద్ధతను సమీక్షించారు. ‘ట్రంప్ కు కనీవినీ ఎరుగని మద్దతును మనం చూడబోతున్నాం’ అని త్వరలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న స్పీన్ స్పైసర్ మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పడం గమనార్హం. ఈ చరిత్రాత్మక ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఏదో ఒక విధంగా పాల్గొనడానికి జనం పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తుడడం పట్ల ట్రంప్ సంతోషంతో ఉన్నారని ఆయన చెప్పారు. వాషింగ్టన్ డిసిలోని ట్రంప్ మద్దతుదారులు ప్రమాణ స్వీకారానికి ముందే ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
ఆర్లింగ్టన్ నేషనల్ స్మశాన వాటికలో ట్రంప్ - ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన మైక్ పెన్స్‌లు దివంగత నేతల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించడంతో గురువారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చరిత్రాత్మక నేషనల్ మాల్ కూడా ఈ వేడుకలకు వేదికగా ఉండబోతోంది. లింకన్ మెమోరియల్ మెట్ల వద్ద దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది కళాకారులు వేలాది మంది ట్రంప్ అభిమానుల సమక్షంలో సంగీత కచేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ సంగీత కచేరి కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/