Begin typing your search above and press return to search.

రిప‌బ్లిక్ డే వేడుకుల‌కు ట్రంప్ కు ఆహ్వానం..నో చెప్పిన వైనం

By:  Tupaki Desk   |   28 Oct 2018 4:35 AM GMT
రిప‌బ్లిక్ డే వేడుకుల‌కు ట్రంప్ కు ఆహ్వానం..నో చెప్పిన వైనం
X
భార‌త ఆహ్వానానికి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నో చెప్పేశారు. ప్ర‌తి ఏటా రిప‌బ్లిక్ డే వేడుక‌ల్ని జ‌న‌వ‌రి 26న నిర్వ‌హించ‌టం తెలిసిందే. ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ప్ర‌తి ఏటా ఒక విదేశీ అతిధిని పిల‌వ‌టం ఒక అల‌వాటైంది. 2015ను గుర్తు తెచ్చుకుంటే.. ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో మోడీ కూర్చొని స‌రిగ్గా ఆరేడు నెల‌లు అయిన ప‌రిస్థితి. అలాంటి వేళ‌.. ఊహించ‌ని రీతిలో పావులు క‌ద‌ప‌ట‌మే కాదు.. అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా భార‌త్ వ‌చ్చేలా చేసిన మోడీ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలో ఒబామాను భార‌త్ రావ‌టానికి ఒప్పించిన మోడీ తీరుపై అప్ప‌ట్లో ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. ఇదే మేజిక్ ను మ‌రోసారి ప్లే చేద్దామ‌నుకున్న మోడీ స‌ర్కారుకు ఊహించిన రీతిలో షాకిచ్చారు ట్రంప్‌. రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొనేందుకు భార‌త్ నుంచి వ‌చ్చిన ఆహ్వానానికి ఆయ‌న నో చెప్పేశారు.

కొత్త ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ ది యూనియ‌న్ ప్ర‌సంగంతో పాటు.. ఇత‌ర ప‌నులు ఉండ‌టంతో తాను భార‌త్‌కు రాలేన‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ట్రంప్ స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై కొంత అనుమానాలు ఉన్న‌ప్ప‌టికీ.. భార‌త్ లాంటి పెద్ద దేశం కోరిన ఆహ్వానాన్ని అంత సింఫుల్ గా ట్రంప్ రిజెక్ట్ చేస్తార‌ని ఏ మాత్రం ఊహించ‌లేద‌ని చెబుతున్నారు. ఈ ఉదంతం క‌చ్ఛితంగా మోడీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఇంత‌కీ భార‌త గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ట్రంప్ ను పిలిస్తే ఎందుకు వ‌ద్ద‌న్నారు? మూడేళ్ల క్రితం ఒబామా అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న కాలంలో.. ఇంత షార్ట్ గ్యాప్ లో ఆహ్వానం ప‌ల‌క‌టం.. అందుకు అటు వైపు నుంచి కూడా ఓకే చెప్ప‌టం ఒబామా ఎపిసోడ్‌లో జ‌రిగింది. మ‌రి.. అదే సీన్ ట్రంప్ హ‌యాంలో ఎందుకు రిపీట్ కాలేద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఇటీవ‌ల కాలంలో అమెరికా కోరిన‌ట్లుగా భార‌త్ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ట్ర‌యంఫ్ ను ర‌ష్యా నుంచి కొనుగోలు చేయ‌టాన్ని అమెరికా ఆగ్ర‌హంతో ఉంది. త‌మ మాట కాద‌ని ర‌ష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ కు పంచ్ ఇచ్చేందుకు ట్రంప్ రెఢీ అయ్యార‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. ఇరాన్ నుంచి ముడిచ‌మురు కొన‌ద్ద‌న్న ఆగ్ర‌రాజ్య మాట‌ను భార‌త్ ఖాత‌రు చేయ‌క‌పోవ‌టం కూడా ట్రంప్ అసంతృప్తికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఇలా తాము చెప్పిన మాట‌ల్ని విన‌ని భార‌త్ ఆహ్వానాన్ని ట్రంప్ రిజెక్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ కొత్త సంవ‌త్స‌రంలో ట్రంప్ ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉండి ఉంటే భార‌త్ రావ‌టానికి ఇబ్బంది అనుకోవ‌చ్చు. అయినా.. మూడేళ్ల క్రితం ఒబామా రావ‌టానికి కుదిరిన టైం ఇప్పుడు ట్రంప్ న‌కు కుద‌ర‌క‌పోవ‌టం ఎందుక‌న్న‌ది భార‌తీయులు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా?