Begin typing your search above and press return to search.

ట్రంప్ ను సాగనంపడానికి రంగం?

By:  Tupaki Desk   |   8 Jun 2017 6:19 AM GMT
ట్రంప్ ను సాగనంపడానికి రంగం?
X
అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వదేశంలో విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల ఉన్న గౌరవాన్నీ పోగొడుతున్న సంగతి తెలిసిందే. ఇంటాబయటా కంపుకంపు చేసుకుంటున్న ట్రంపును సాగనంపడానికి అమెరికన్లు సిద్ధమవుతున్నారని... అందుకు అభిశంసన అస్ర్తాన్ని బయటకు తీయబోతున్నారని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఈ రోజే అందుకు బీజం పడుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణమూ కనిపిస్తోంది.

ఎఫ్‌ బీఐ డైరక్టర్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన జేమ్స్‌ కోమీ ఈ రోజు వాషింగ్టన్‌ లో సెనెట్‌ ఇంటలిజెన్స్‌ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సెనెటర్లు అడిగే ప్రశ్నలకు ఆయన ప్రమాణ పూర్వకంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆయన ట్రంప్‌ ను ఇరుకున పెట్టే పలు కీలక అంశాలను బయటపెట్టేస్తారని అంతా భావిస్తున్నారు. అదే కనుక జరిగితే ట్రంపును ఇంటికి పంపే కార్యక్రరమం మొదలవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7.30 గంటలకు నిర్వహించబోయే ఈ విచారణ కోసం అమెరికన్లు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రష్యా సహకరించిందని, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ - ఇతర డెమొక్రటిక్‌ పార్టీ సీనియర్‌ నాయకుల ఈ మెయిల్స్‌ ను లీక్‌ చేయడం ద్వారా ట్రంప్‌ కు సహకరించిందనేది ఆరోపణ. దీనిపై ఎఫ్‌ బీఐ విచారణ జరుపుతోంది. ట్రంప్‌ రష్యా తో నడిపిన వ్యవహారాలను కోమీ బయటపెడతారని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే ట్రంప్ అభిసంసన డిమాండ్లు బలపడతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/