Begin typing your search above and press return to search.

ట్రంప్ ఇంకో ర‌చ్చ‌..హ‌క్కుల మండ‌లికి గుడ్‌ బై

By:  Tupaki Desk   |   20 Jun 2018 10:25 AM GMT
ట్రంప్ ఇంకో ర‌చ్చ‌..హ‌క్కుల మండ‌లికి గుడ్‌ బై
X
ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయంగా వివిధ దేశాల‌తో సంబంధాలు నెల‌కొల్ప‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌లువురి మ‌న‌సు గెలుచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న దూకుడును పోగొట్టుకోలేదు. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంది. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపడంతోపాటు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వాళ్లను ఉపేక్షించడాన్ని నిరసిస్తూ యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఎన్నో నెలలుగా ట్రంప్ ప్రభుత్వం తప్పుకుంటామని హెచ్చరిస్తున్నది. తాజాగా అమెరికా - మెక్సికో సరిహద్దులో వలసదారుల నుంచి పిల్లలను ట్రంప్ ప్రభుత్వం వేరు చేస్తుండటంపై యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మరుసటి రోజే అమెరికా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

మండలిలో అమెరికా డిమాండ్ చేసిన సంస్కరణలను చేపట్టడం విఫలమవడం కారణంగానే తాము తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ వెల్లడించారు. `మానవ హక్కులను ఉల్లంఘించే వాళ్లే ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. వాళ్లే కౌన్సిల్‌ కు ఎన్నికవుతున్నారు` అని హేలీ విమర్శించారు. `ప్రపంచంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారు యథేచ్ఛగా పాలిస్తున్నారు. మానవ హక్కులను కాపాడుతున్న దేశాలను బలి పశువులను చేస్తున్నారు. రాజకీయ వివక్షకు ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల మండలి వేదికైందని - ఉల్లంఘిస్తున్న వారినే అందలమెక్కిస్తున్నారు` అని నిక్కీ హేలీ తీవ్రంగా దుయ్యబట్టారు.

కాగా, స్విట్జర్లాండ్‌ లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మొత్తం 47 దేశాలు ఉన్నాయి. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారికి వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ వెల్లడించారు. అయితే అమెరికా నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది స‌రైన సంకేతాల‌ను పంప‌ద‌ని పేర్కొంది.