Begin typing your search above and press return to search.
ట్రంప్ ఎఫెక్ట్: ఆ ఒక్కడికే లక్షల కోట్ల లాభం
By: Tupaki Desk | 25 Feb 2018 11:41 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అనూహ్య నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకు ఇదో నిదర్శనం. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ ఫుల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ హాథవే లాభాల్ని అమాంతం పెంచేసింది. అగ్రరాజ్య నూతన పన్ను చట్టంతో సంస్థ లాభం ఏకంగా రూ.2 లక్షల కోట్ల మేర ఎగబాకింది మరి. గతేడాది కంపెనీకి 65.3 బిలియన్ డాలర్ల నిర్వహణపరమైన లాభం రాగా - ఇందులో వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చింది 36 బిలియన్ డాలర్లు మాత్రమే. 29.3 బిలియన్ డాలర్లు కార్పొరేట్ పన్ను కోతలతోనే మిగలడం గమనార్హం. డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం ఇది రూ.1,89,600 కోట్లతో సమానం. ఈ విషయాన్ని భాగస్వాములకు రాసిన వార్షిక లేఖలో బెర్క్ షైర్ చైర్మన్ - సీఈవో వారెన్ బఫెట్ పేర్కొన్నారు.
అమెరికా కార్పొరేట్ సంస్థలు చెల్లించే పన్నును నిరుడు డిసెంబర్ లో 35 శాతం నుంచి 21 శాతానికి ట్రంప్ సర్కారు తగ్గించిన సంగతి విదితమే.ఇది అక్కడి కార్పొరేట్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా - బిలియనీర్ ఇన్వెస్టరైన బఫెట్ కు మరింత కలిసొస్తోంది. ట్రంప్ నిర్ణయం.. బెర్క్ షైర్ కార్పొరేట్ పన్ను చెల్లింపులను భారీగా తగ్గించింది. ఇక 2017లో బెర్క్ షైర్ నికర ఆదాయం ఒక్కసారిగా 44.94 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 2016లో ఇది 24.07 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. తగ్గిన కార్పొరేట్ పన్నుతో మా ఆదాయం కూడా పెరిగిందని వారెన్ బఫెట్ తన లేఖలో స్పష్టం చేశారు. కాగా, బెర్క్ షైర్ హాథవేకు పదుల సంఖ్యలో సంస్థలుండగా - డైరీ క్వీన్ నుంచి డ్యూరాసెల్ వరకు బెర్క్ షైర్ వే. అంతేగాక అమెరికన్ ఎక్స్ ప్రెస్ - యాపిల్ - బ్యాంక్ ఆఫ్ అమెరికా - చార్టర్ కమ్యూనికేషన్స్ - కోకా-కోలా - డెల్టా ఎయిర్ లైన్స్ - జనరల్ మోటార్స్ - గోల్డ్ మన్ సాచ్స్ - మూడీస్ - వెల్స్ ఫార్గో - సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థల్లోనూ బెర్క్ షైర్ కు చెప్పుకోదగ్గ వాటాలే ఉన్నాయి.
87 ఏళ్ల బఫెట్.. 11వ యేట నుంచే పెట్టుబడులు పెడుతుండటం విశేషం. బెర్క్ షైర్ హాథవే నగదు నిల్వలు 116 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బఫెట్ తెలిపారు. మున్ముందు మరిన్ని సంస్థల కొనుగోలుకు ఈ నిధులను వినియోగిస్తామని ఈ సందర్భంగా బఫెట్ ప్రకటించారు. 2017 నాటికి సంస్థ ఈక్విటీ విలువ 358 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు.