Begin typing your search above and press return to search.

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కిమ్ ప్ర‌కంప‌న‌లు

By:  Tupaki Desk   |   22 Sep 2017 9:03 AM GMT
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కిమ్ ప్ర‌కంప‌న‌లు
X
చిన్న చిన్న ర‌చ్చ‌ల‌తో సాగుతున్న ప్ర‌పంచ ప‌య‌నానికి స‌రికొత్త ముప్పు వాటిల్లిన‌ట్లుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మొండోడో రాజు కంటే బ‌ల‌వంతుడ‌న్న సామెత మాదిరి.. మొండోడే నియంత అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌పంచానికి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి. కొర‌క‌రాని కొయ్య‌లా మారిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ తీరుతో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కానిదిగా మారింది.

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రిగినా.. రెండు అగ్ర‌దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల లెక్క‌ల‌కు.. తాజాగా కిమ్ లాంటి మూర్ఖుడి లెక్క‌ల‌కు అస్స‌లు పొంత‌నే ఉండ‌ని ప‌రిస్థితి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. కిమ్ చేతిలోని అణ్వ‌స్త్ర ఆయుధాలు ఇప్పుడు ప్ర‌పంచానికి కొత్త స‌మ‌స్య‌గా మారింది.

అగ్ర‌రాజ్య‌మైన అమెరికాపై గురి పెట్టిన కిమ్‌.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం తెలిసిందే. అమెరికా స‌ర్వ‌నాశ‌నం అయిపోతున్న‌ట్లుగా గ్రాఫిక్స్ వీడియోలు త‌యారు చేసి రెచ్చ‌గొట్ట‌ట‌మే కాకుండా.. త‌మ‌తో పెట్టుకుంటే అంతే సంగ‌తులు అంటూ బెదిరిస్తున్నారు. ఇలా త‌ల ఎగుర‌వేసే ఉదంతాల్ని ఈ మ‌ధ్య‌న చూడ‌ని అమెరికాకు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఒక చిన్న భూభాగంలో ఉన్న ఒక నియంత త‌మ లాంటి అగ్ర‌రాజ్యం మీద‌నే కాలు దువ్వుతాడా? అని అగ్ర‌రాజ్యం ర‌గిలిపోతోంది.

కిమ్ తీరుతో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. అయితే.. ఉత్త‌ర‌కొరియా మీద ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న అంశంపై తుది నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నాడు. త‌న ద‌గ్గ‌ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ ఆయుధ సంప‌త్తి ఉన్న‌ప్ప‌టికీ.. త‌న మిత్ర‌దేశాల‌కు కిమ్ కార‌ణంగా ఏమీ కాకూడ‌ద‌న్న‌ది అమెరికా పాల‌సీ. దీంతో.. కిమ్‌ ను ఎలా కంట్రోల్ చేయాల‌న్న విష‌యంపై కిందామీదా ప‌డుతోంది.

లోప‌ల సంగ‌తి ఎలా ఉన్నా బ‌య‌ట మాత్రం గాంభీర్యాన్ని కంటిన్యూ చేస్తోంది. ఐక్యారాజ్య‌స‌మితి మీద మాట్లాడిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. కిమ్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తాము త‌లుచుకుంటే నామ‌రూపాల్లేకుండా పోతార‌ని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు తాజాగా కిమ్ రియాక్ట్ అయ్యారు.

ట్రంప్‌ ను మ‌తి చెడిన పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడంటూ మండిప‌డిన ఆయ‌న‌.. ఉత్త‌ర‌కొరియాను నాశ‌నం చేస్తానంటూ వ్యాఖ్య‌లు చేసినందుకు ట్రంప్ త‌గిన మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌ద‌ని కిమ్ వార్నింగ్ ఇచ్చాడు. ఉత్త‌ర‌కొరియాపై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కిమ్‌.. ఒక సార్వ‌భౌమాధికార దేశాన్ని పూర్తిగా నాశ‌నం చేస్తాన‌ని చెప్ప‌టం ద్వారా అమెరికా అధ్య‌క్షుడు పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తించాడ‌ని కిమ్ ఫైర్ అయ్యారు. ట్రంప్ వార్నింగులు కుక్క అరుపులేన‌ని.. వాటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చాడు.

వ‌రుస పెట్టి నిర్వ‌హిస్తున్న ఉత్త‌ర కొరియా అణ్వాయుధ ప‌రీక్ష‌లు ప్ర‌పంచానికి గుబులు రేపుతున్నాయి. త‌మ‌పై ఎన్ని ఆంక్ష‌లు విధించినా అణ్వాయుధ ప‌రీక్ష‌ల్ని వ‌దిలిపెట్టేదే లేద‌ని కిమ్ తేల్చి చెబుతున్నారు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియాపై ఐక్య‌రాజ్య‌సమితి విధించిన కొత్త ఆంక్ష‌లపై చైనా ఆందోళ‌న చెందుతోంది. ప‌రిస్థితులు ఇదే తీరులో కొన‌సాగితే.. మూడో ప్ర‌పంచ‌యుద్ధంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని చైనా మీడియా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

అమెరికా.. ఉత్త‌ర‌కొరియాలు త‌మ స‌మాధుల్ని తామే త‌వ్వ‌కుంటార‌ని చైనా మీడియా వ్యాఖ్యానించింది. అమెరికా మ‌ద్ద‌తు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ద‌క్షిణ కొరియానుఉత్త‌ర కొరియా బారి నుంచి త‌ప్పించ‌లేర‌ని వ్యాఖ్యానించింది. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను మొహ‌రించినా అమెరికా.. ద‌క్షిణ కొరియాలు ఉత్త‌రకొరియాను ఏమీ చేయ‌లేవ‌ని చెబుతోంది. ఆంక్ష‌ల‌తో ఉత్త‌ర‌కొరియాను ఒంట‌రి చేసి మ‌రింత రెచ్చ‌గొడుతున్నార‌న్నారు.

మూర్ఖ‌త్వంతో వ్య‌వ‌హ‌రించే ఉత్త‌ర‌కొరియాకు మ‌ద్ద‌తుగా చైనా మాట్లాడ‌టం వెనుక వ్యాపార ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మ‌ధ్య భారీ ఎత్తున వ్యాపారఒప్పందాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఉత్త‌ర‌కొరియాను చ‌క్క‌టి వ్యాపార కేంద్రంగా చేసుకుంది చైనా. ఓవైపు ఉత్త‌ర‌కొరియాతో మ‌న‌కెందుకు అన్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తూనే.. మ‌రోవైపు అణ్వ‌యుధ ప‌రీక్ష‌ల్ని నిలిపివేయాలంటూ ఉత్త‌ర కొరియాకు చైనా త‌న‌దైన స్టైల్లో సుద్దులు చెబుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కిమ్ వ్యాఖ్య‌ల పుణ్య‌మా అని స్టాక్ మార్కెట్లు మ‌రోసారి ప్ర‌భావిత‌వ‌య్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు ప‌డిపోతే.. నిఫ్టీ సైతం కీల‌క‌మైన 10,100ను కోల్పోయింది. 72 పాయింట్ల మేర న‌ష్ట‌పోయింది. ఆ షేరు.. ఈ షేరు అన్న తేడా లేకుండా అన్ని స్టాకులు న‌ష్ట‌పోతున్నాయి. డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ కూడా భారీగా 82 పైస‌లు న‌ష్ట‌పోయి రూ.65పైనే ట్రేడ‌వుతోంది. బంగారం ధ‌ర 216 రూపాయిల న‌ష్టంతో ప‌ది గ్రాములు రూ.29,558 ప‌లుకుతోంది.