Begin typing your search above and press return to search.

టీచర్లకు తుపాకులు ఇస్తాం: డొనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:56 AM GMT
టీచర్లకు తుపాకులు ఇస్తాం: డొనాల్డ్ ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తుపాకులను ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడాలోని ఓ హైస్కూల్‌ లో మాజీ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పుల జరిపిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 14 మంది విద్యార్థులే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. విషాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు, బాధితులతో వైట్‌ హౌస్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. గన్ ఫ్రీ జోన్ ఉండటం వల్ల ఉన్మాదులు అక్కడి వచ్చి కాల్పులు జరుపుతున్నారని ఇక గన్ ఫ్రీ జోన్ లేకపోతే ఇలాంటి ఘటనలు మున్ముందు జరిగే అవకాశాలు తగ్గుతాయని అన్నారు.

అనంత‌రం అధ్య‌క్షుడు ట్రంప్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో 20శాతం మందికి తుపాకులను ఎలా వినియోగించాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించాడు. తుపాకుల యాజమానులకు నిబంధనలు కఠినతరం చేస్తామని, భవిష్యత్‌లో కొత్త వారికి జారీ చేసేటప్పుడు పక్కా ప్రణాళికతో వారికి అనుమతులు ఇస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఉగ్రదాడికి ఏమాత్రమూ తీసిపోని మానసికోన్మాదం అమెరికాలోని ఫ్లోరిడాలో నెత్తుటేర్లు పారించిన సంగ‌తి తెలిసిందే. 19 ఏళ్ల‌ కూడా నిండని యువకుడు 17మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్నాడు. తుపాకీ చేతబట్టిన టీనేజర్.. పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఓ ఇండియన్-అమెరికన్ విద్యార్థి సహా 19మంది గాయపడ్డారు.

అమెరికా చరిత్రలో ఒక పాఠశాలలో నరమేధం జరుగడం ఇది ఎనిమిదోసారి అని మదర్‌ జోన్స్ క్రైమ్‌ డేటా వెల్లడిస్తోంది. 1982 నుంచి జరిగిన నరమేధాలను రికార్డు చేసిన ఆ సంస్థ పాఠశాలల్లో ఇలా కాల్పులు జరిగిన ప్రతీసారి కనీసం నలుగురు వ్యక్తులు మృతిచెందినట్లు తెలిపింది. 2012లో కనెక్టికట్‌ లోని శాండీహుక్ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఫ్లోరిడా ఘటన అత్యంత పాశవికమైన ఘటన.