Begin typing your search above and press return to search.

కిమ్‌ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   25 Feb 2018 4:34 AM GMT
కిమ్‌ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు కుంప‌టి రాజేశారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్యర్థి ఉత్త‌ర‌కొరియా ర‌థ‌సార‌థి కిమ్ విష‌యంలో కొద్దికాలం సంయ‌మ‌నం పాటించిన ట్రంప్ తాజాగా మ‌ళ్లీ ఆయ‌న్ను కెలికే నిర్ణ‌యం తీసుకున్నారు. ఉత్తరకొరియాపై అమెరికా అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. ఖండాంతర క్షిపణులు అభివృద్ధి చేయకుండా - అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా ఉత్తర కొరియా షిప్పింగ్ కంపెనీలపై అమెరికా ఈ ఆంక్షలను ప్రకటించింది. ఈ ఆంక్షలతోనైనా ఉత్తరకొరియా మారుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి ఆంక్షలను అమెరికా మునుపెన్నడూ ఏ దేశంపై కూడా విధించలేదని ట్రంప్ మీడియాకు తెలిపారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న‌కు ముందు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ ముంచిన్ ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల వివరాలను వెల్లడించారు. ఉత్తర కొరియాకు చెందిన నౌకలు - షిప్పింగ్ - వాణిజ్య కంపెనీలు - ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశానికి సహాయపడుతున్న వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. తమ ఆంక్షలు 27 సంస్థలు - 28 నౌకలు - ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నాయని వివరించారు. ఈ ఆంక్షలను అధిగమించి ఎవరైనా ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకొంటే ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటామని అమెరికా హెచ్చరించింది. మరోవైపు - ఉత్తరకొరియాపై విధించిన ఈ ఆంక్షలు ఫలించకపోతే రెండో దశ ఆంక్షలకు తెరతీస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. రెండో దశ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయన్నారు. భారత్ - చైనాలపై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆ రెండు దేశాల వల్లే భూతాప నివారణకు కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి తాము వైదొలిగామని ట్రంప్ అన్నారు.

ఇదిలా ఉండగా, వివిధ దేశాలలోని ఉత్తరకొరియాకు చెందిన బ్యాంకులు హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నాయని, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేస్తున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో ఆ బ్యాంకుల శాఖలను మూసివేయాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది.