Begin typing your search above and press return to search.

కొరియా ఇక ఎక్కువ రోజులు ఉండదుః ట్రంప్

By:  Tupaki Desk   |   24 Sep 2017 10:35 AM GMT
కొరియా ఇక ఎక్కువ రోజులు ఉండదుః ట్రంప్
X
ఉత్త‌ర‌కొరియా- అమెరికా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశాధినేత‌లైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మ‌ధ్య వివాదం సాగ‌గా ఈ ఎపిసోడ్‌లోకి ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో ఎంట్రీ ఇవ్వ‌డం మ‌రింత వేడి పెరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రి యాంగ్ హో మాట్లాడుతూ ఉన్మాదంతో ఊగిపోతున్న ఓ పిచ్చోడిగా ట్రంప్‌ ను అభివర్ణించారు. ఆయనతో ప్రపంచ శాంతికి ముప్పంటూ తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తానన్న ట్రంప్ హెచ్చరికలతో ఇక మా రాకెట్లు అమెరికా ప్రధాన భూభాగంలోకి దూసుకెళ్లడం ఖాయమని కూడా యాంగ్ హెచ్చరించారు. దీనిపై ట్రంప్ ట్విట్టర్‌ లో స్పందిస్తూ ఉత్తర కొరియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో కామెంట్ల నేప‌థ్యంలో ట్రంప్‌ మరింత ఘాటుగా స్పందిస్తూ నార్త్ కొరియా ఇక ఎక్కువ రోజులు ఉండదంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడే ఉత్త‌ర‌కొరియా విదేశాంగ మంత్రి యాంగ్ హో మాటలు విన్నానని చెప్పిన ట్రంప్.. కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ ను లిటిల్ రాకెట్ మ్యాన్ అంటూ అభివర్ణించారు. ఆ లిటిల్ రాకెట్ మ్యాన్ ఆలోచనలనే యాంగ్ కూడా ఐక్య రాజ్య సమితిలో వినిపించినట్లయితే ఆ దేశం ఇక ఎక్కువ రోజులు ఉండదు అంటూ ట్వీట్ చేశారు. ఈ మాట‌ల యుద్ధం అంత‌ర్జాతీయంగా క‌ల‌కలం సృష్టిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా....మరోవైపు యూఎన్‌ లో కొరియా ప్రసంగాన్ని సీరియస్‌ గా తీసుకున్న అమెరికా కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా క‌నిపిస్తోంది. నార్త్ కొరియా, దక్షిణ కొరియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో అమెరికా బాంబర్లు చెక్కర్లు కొట్టాయి. నిజానికి ఇది అంతర్జాతీయ గగనతలం. ఉత్తర కొరియా నిర్లక్ష్యపు వైఖరిని ట్రంప్ ఎంత సీరియస్‌ గా తీసుకుంటున్నారో తెలియజెప్పడానికే ఇలా బాంబర్లు ఆ గగనతలంలో తిరుగుతున్నాయని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి అధ్యక్షుడి దగ్గర తగిన మిలిటరీ ఆప్షన్లు ఉన్నాయని చెప్పేందుకు ఇది నిదర్శనమని పెంటగాన్ స్పష్టం చేసింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం ఏషియా - పసిఫిక్ ప్రాంతానికి తీవ్ర ముప్పు అని ఈ సందర్భంగా తెలిపింది. అమెరికాతోపాటు మిత్ర దేశాలన్నింటినీ కాపాడుకోవడానికి తమకున్న మిలిటరీని పూర్తిస్థాయిలో వినియోగించడానికి ఏమాత్రం వెనుకాడబోమని పెంటగాన్ హెచ్చరించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా ఎంత‌కైనా తెగించి ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.