Begin typing your search above and press return to search.

ఐస్ క్రీం తింటూ అతని చావు వార్తను విన్న ట్రంప్

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:08 AM GMT
ఐస్ క్రీం తింటూ అతని చావు వార్తను విన్న ట్రంప్
X
ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని డ్రోన్ సాయంతో హతమార్చిన వైనం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా చేయటమే కాదు.. యుధ్దభయాన్ని పెంచుతున్నాయి. సులేమానీని హతమార్చిన తీరుపై అమెరికాలోని డెమోక్రాట్లు సైతం తప్పు పడుతున్నారు. పలు దేశాలు అమెరికా చర్యను ప్రశ్నిస్తున్నాయి. ఇక.. ఇరాక్.. ఇరాన్ అయితే అమెరికా చర్యకు రగిలిపోవటమే కాదు.. మూల్యం చెల్లించుకోక తప్పదని తేల్చి చెబుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సులేమానీ మరణవార్త వినే సమయంలో ట్రంప్ ఉన్న మూడ్ గురించి విన్నోళ్లంతా రగిలిపోతున్నారు.

సులేమానీ మరణవార్తను ధ్రువీకరించుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు తన ట్విట్టర్ ఖాతాలో అమెరికా జెండాను మాత్రమే పోస్టు చేశారు. ఎలాంటి వ్యాఖ్యలు పెట్టలేదు. నిజానికి ఆ సమయంలో ట్రంప్ క్రిస్మస్ బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లోరిడా తీరంలోని పామ్ బీచ్ లోని అందమైన రిసార్టులో ఆయన తన కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నారు.

ఒక ఐస్ క్రీం తింటున్న సమయంలో ఆయనకు సులేమానీని హతమార్చాలన్న తన ఆదేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన వైనాన్ని విన్నారు. ఆ సమయంలో ట్రంప్ వెంట కాంగ్రెస్ లోని కెవిన్ మెకర్తీతో పాటు మరికొందరు స్నేహితులు ఉన్నారు. ఐస్ క్రీమ్ తో పాటు మీట్ లీఫ్ ను ఆర్డర్ చేసి దాన్ని తింటూ సులేమానీ మరణవార్తను ఎంజాయ్ చేసినట్లుగా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు తమ దేశ సైనిక చీఫ్ దారుణంగా హతమార్చి ఎంజాయ్ చేయటాన్ని ఆ దేశస్తులే కాదు.. మిగిలిన దేశాలకు చెందిన మితవాదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరని చెప్పక తప్పదు.