Begin typing your search above and press return to search.

ట్రంప్ గెలుపుపై ఇండియన్స్ ఏమంటున్నారు?

By:  Tupaki Desk   |   10 Nov 2016 1:58 AM GMT
ట్రంప్ గెలుపుపై ఇండియన్స్ ఏమంటున్నారు?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరి ఊహలకూ అందకుండా, అంచనలన్నింటిని తలకిందులుచేస్తూ దూసుకుపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ ఫలితాల అనంతరం తీవ్రతరమైంది. ఈ విషయంలో ట్రంప్ గెలుపుపై అమెరికాలోని ఒకవర్గం ఇప్పటికే తమ నిరసనలను తెలియజేస్తుంటే... రష్యా, ఇండియా లు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సమయంలో ట్రంప్ విజయంలో ఇండియన్స్ పాత్ర కీలకంగా మారిందని కథనాలొస్తున్న తరుణంలో... ట్రంప్ గెలుపు ఇండియాకు ప్రయోజనమే అని భారతీయులు భావిస్తున్నారు.

వాస్తవానికి ట్రంప్ రాజకీయవేత్త కాదు.. రాజకీయంగా పరిపాలనా పరంగా ఆయనకు ఎలాంటి అనుభవమూ లేదు. కానీ ఆయన ప్రసంగాలు మాత్రం ఆయన రాజకీయ పరిణతను సూచిస్తున్నాయని చెప్పేవారే ఎక్కువని చెప్పుకోవాలి. ఇదే సమయంలో ట్రంప్ ప్రచార సభల్లో చాలాసార్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇండియాలోని ఏక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ ఇతర దేశాలకు ఆదర్శప్రాయుడయ్యారు అని వ్యాఖ్యానించారు కూడా ట్రంప్. తాను గెలిస్తే అమెరికాలోని భారతీయులు ప్రయోజనాలకు కృషి చేస్తానని ట్రంప్ పదేపదే హామీ ఇవ్వడం నేటి ట్రంప్ విజయంలో ఒక కీలక పాత్ర పోషించిందనేది కూడా ముఖ్యమైన అంశం.

ఇక భారత్ కు మరింతగా అనుకూలించే అంశాల్లో ఆయన వ్యాపారాలు, ఉగ్రవాదులపై ఆయనకున్న వ్యతిరేకతలను చెప్పుకోవాలి. ముంబై వంటి నగరల్లో ఇప్పటికే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలుపెట్టడం ఈసమయంలో శుభపరిణామనే చెప్పాలి. ఇదే సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పట్ల ట్రంప్ కఠినంగా మాట్లాడడం భారత్ కు అనుకూలించే అంశం. ఈ విషయంలో హిల్లరీతో పోలిస్తే ట్రంప్ కచ్చితంగా దూకుడుగా చర్యలు తీసుకోగలరనే చెప్పాలి. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆయన బహిరంగంగా ఖండించడం ఈ విషయంపై ఆశలు పెంచుతుంది! దీంతో ట్రంప్ గెలుపు వల్ల కచ్చితంగా భారత్ కు మంచి జరుగుతుందని ఇండియాన్స్ భావిస్తున్నారు!!

కాగా... ట్రంప్ గెలుపు అనంతరం శుభాకాంక్షలు చెప్పిన మోడీ కూడా ఇదే విషయాన్ని చెబుతు... ట్రంప్ ద్వారా అమెరికా - భారత్ బందాలు మరింతగా బలపడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు!