Begin typing your search above and press return to search.

అయోధ్య రాములోరికి చందాలు వద్దట..ఆన్ లైన్ లో ఇస్తే చాలట

By:  Tupaki Desk   |   7 March 2021 6:30 AM
అయోధ్య రాములోరికి చందాలు వద్దట..ఆన్ లైన్ లో ఇస్తే చాలట
X
దశాబ్దాల కల ఇప్పుడిప్పుడే సాకారం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి కల కనని హిందువు ఉండరు. సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో రామాలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ అద్భుత నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా చందాలు సేకరిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి అంతో ఇంతో విరాళంగా రావాలన్న సంకల్పానికి తగ్గట్లే.. భారీ ఎత్తున రామాలయాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే వందల కోట్ల రూపాయిల్ని చందాల రూపంలో సేకరించారు. తాజాగా ఈ చందాల సేకరణకు సంబంధించి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ కీలక ప్రకటన చేశారు. రామ మందిర నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ఈ ట్రస్టు విశ్వహిందూ పరిషత్ ను కోరింది. దీంతో దేశ వ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల్ని స్వీకరిస్తున్నారు.

సామాన్యుల మొదలు ప్రముఖుల వరకు ఎవరికి వారు.. తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చే వీలుంది. దీంతో.. దేశ వ్యాప్తంగా జనవరి నుంచి పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అపూర్వ ఆదరణ రావటమే కాదు.. పెద్ద ఎత్తున చందాలు పోగయ్యాయి. దీంతో.. అనుకున్న మేరకు మించిన మొత్తాలు విరాళాల రూపంలో జమయ్యాయి. దీంతో..ఇంటింటికి వెళ్లి చందాలు స్వీకరించే విధానానికి చెక్ పెట్టేశారు. ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే.. నేరుగా ఆన్ లైన్ ద్వారా నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. రానున్న మూడేళ్ల వ్యవధిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రామాలయం పూర్తి కానున్నట్లు చెబుతున్నారు.