Begin typing your search above and press return to search.

మునుగోడు ప్రజలారా మీరు మోసపోకండి

By:  Tupaki Desk   |   15 Oct 2022 11:47 AM GMT
మునుగోడు ప్రజలారా మీరు మోసపోకండి
X
తెలంగాణలో ఎన్నికలు వస్తేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. లేదంటే అభివృద్ధి అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ సహా మంత్రుల నియోజకవర్గాలకే పరిమితమవుతుంది. ఎన్నికలు అనగానే హుజూరాబాద్ లో దళితబంధు పేరిట మనిషి రూ.10 లక్షలు కుమ్మరించింది కేసీఆర్ సర్కార్.. హుజూరాబాద్, దుబ్బాకలను అద్దంలా మార్చేసింది. అందుకే అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు రావాల్సిందేనంటారు.

రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు వేస్తూ వెళుతుంటారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్, దుబ్బాకలో ఎంత ప్రయత్నించినా టీఆర్ఎస్ గెలవలేదు. బీజేపీ బలమైన అభ్యర్థులను దించి గెలిచేసింది. ఇప్పుడు మునుగోడు వంతు వచ్చేసింది. ఇక్కడ టీఆర్ఎస్ గెలవకపోతే ఆ పార్టీలో కుమ్ములాటలు మొదలై అంతా టీఆర్ఎస్ కు క్యూ కట్టడం ఖాయం. అందుకే మునుగోడు గెలుపు టీఆర్ఎస్ కు అత్యంత కీలకం అని చెప్పొచ్చు.

ఇక ప్రజలను కూడా కొందరు అవగాహన కల్పిస్తూ మోసపోకండి అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ మునుగోడు ప్రజలకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు. తాజాగా మునుగోడులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి.

మునుగోడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వాల్ పోస్టర్లు వెలిశాయి. దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పాటు 'మేం మోసపోయాం.. మీరు మోసపోకండి' అని ఆ పోస్టర్లలో రాసి ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు ఈ పోస్టర్లు అంటించినట్లు తెలుస్తోంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడి బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సో అక్కడ ఏ పనులు కావడం లేదన్న కోణంలోనే ఈ పోస్టర్లు అంటించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కోసం అధికార పార్టీని గెలిపించాలన్నట్టుగా ఈ మెసేజ్ ఉన్నట్టు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.