Begin typing your search above and press return to search.

మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోరా? - ప్ర‌ధాని మీటింగ్‌లో సీఎం ఆవేద‌న‌!

By:  Tupaki Desk   |   24 April 2021 2:30 AM GMT
మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోరా? - ప్ర‌ధాని మీటింగ్‌లో సీఎం ఆవేద‌న‌!
X
దేశంలో కొవిడ్‌-19 మార‌ణహోమం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలో ఎక్క‌డా న‌మోదుకాని రీతిలో ఇండియాలో ఆల్ టైమ్ రికార్డు కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ తీవ్ర‌త మ‌రింత‌గా కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో.. దేశం మొత్తం భ‌యం గుప్పిట కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ.. కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన‌ ఈ స‌మావేశంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మాట్లాడిన మాట‌లు.. అంద‌రినీ క‌ల‌చి వేశాయి. ఈ దారుణ‌ విల‌యం కొన‌సాగుతున్న వేళ.. ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉండిపోతున్నామ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశారట‌. ఇక‌, ఢిల్లీ ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేజ్రీవాల్ తీవ్ర‌ భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది.

ఢిల్లీలో ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రాలు లేవ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి.. త‌మ‌కు ఆక్సీజ‌న్ అందుబాటులో ఉండ‌ట్లేద‌ని అన్నారు. ఆసుప‌త్రుల్లో రోగులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నార‌ని తీవ్ర ఆవేద‌న చెందారని స‌మాచారం. ఆక్సీజ‌న్ అందుబాటులో ఉండ‌ట్లేద‌ని, ఈ విష‌య‌మై తాను ఎవ‌రితో మాట్లాడాలో చెప్పాల‌ని ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా.. కొవిడ్ బారిన ప‌డ్డ‌వారు స‌రైన‌ వైద్యం ల‌భించ‌క‌ చేస్తున్న ఆర్త‌నాలను త‌లుచుకుంటే.. రాత్రిళ్లు త‌న‌కు నిద్ర కూడా ప‌ట్ట‌ట్లేద‌ని కేజ్రీవాల్‌ ఆవేద‌న వ్య‌క్తంచేశారట‌. తాను సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిల్లో ఉన్నాన‌ని ఉద్వేగానికి లోనైన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగినా.. త‌న‌ను ప్ర‌జ‌లంతా క్ష‌మించాల‌ని కేజ్రీవాల్ కోర‌డం ఆయ‌న నిస్స‌హాయ స్థితిని తెలియ‌జేసింద‌ని అంటున్నారు.

కాగా.. ఢిల్లీకి సంబంధించిన మెజారిటీ నిర్ణ‌యాలు కేంద్రం చేతిలోనే ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. అక్క‌డ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తోనే ఎక్కువ పాల‌న సాగుతుంద‌ని అంటారు. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో.. కేజ్రీవాల్ చెప్పిన‌ మాట‌ల‌కు న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంది? ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందన్న‌ది ఆస‌క్తిగా మారింది.