Begin typing your search above and press return to search.

డోంట్ కేర్ : స్టైల్ మార్చిన జగన్....?

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:30 PM GMT
డోంట్ కేర్ : స్టైల్ మార్చిన జగన్....?
X
ఏపీలో విపక్షాలు మాట్లాడడం మొదలుపెడితే జగన్ తోనే ఆరంభించి జగన్ తోనే ముగిస్తారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అయితే రోజూ ఏదో విషయాన జగన్ నామస్మరణతో తరిస్తారు. అది వారి రాజకీయానికి అవసరం కూడా. రేపటి ఎన్నికల్లో అధికారం లోకి రావాలీ అంటే జగన్ని విమర్శించి జనాలలో తమ పరపతి పెంచుకోవాలన్నదే వారి ఎత్తుగడ. అందుకే పబ్లిక్ మీటింగ్ అయినా లేక మీడియా సమావేశం అయిన లేక పార్టీ మీటింగ్ అయినా జగన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు అయితే ఒక లెక్కన సాగుతూంటాయి.

మరో వైపు జనసేన అధినేత తాను ఏ పార్టీ కొమ్ము కాయను అంటూనే టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా జగన్ గురించే ఎక్కువగా మాట్లాడుతూంటారు. మరి ఇంతలా జగన్ని టార్గెట్ చేస్తూంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ వైపు నుంచి కౌంటర్లు ఉండవా అంటే ఉంటాయి కానీ అది జగన్ లెవెల్ లో కాదు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. అంటే ఆ దూషణ భూషణలు ఏవీ తన దాకా రాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి.

ఇక జగన్ అయితే మీడియా సమావేశాలు ఎటూ జరపరు. ఆయన పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం అయితే ఈ మధ్యనే జరుగుతోంది. ఆ మీటింగ్స్ లోనే కేవలం ఒకటి రెండు నిముషాల పాటు మాత్రమే విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యన దుష్ట చతుష్టయం అంటూ ప్రతీ చోటా జగన్ గట్టిగా చెబుతూ వచ్చేవారు. అలాగే పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడు అని కూడా విమర్శించేవారు.

అయితే లేటెస్ట్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో మాత్రం జగన్ ఎక్కడా విపక్షాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముగించేశారు. నిజంగా జగన్ ఏదో మాట్లాడుతారు గట్టిగా కౌంటర్ ఇస్తారు అని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఇప్పటిదాకా ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ లోనే విపక్షాల కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యే జగన్ ఈసారి మాత్రం అసలు ఆ ఊసే లేకుండా తమ స్పీచ్ ముగించేయడం విశేషం. దాంతో వైసీపీ వారితో పాటు విపక్షాలు కూడా నిరాశ చెందాయనే అంటున్నారు.

జగన్ ఏదైనా అంటే ఒకటికి నాలుగు అనాలని విపక్షం ఎటూ ఉబలాటపడుతుంది. అయితే వారు అంటారని కాదు కానీ తన మీద వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఏదో ఒక వేదిక మీద స్పందించాల్సి ఉంటుంది కదా అన్న వారూ ఉన్నారు. అయితే జగన్ ఏమనుకున్నరో ఏమో కానీ విపక్షాల కామెంట్స్ కి డోంట్ కేర్ అన్న తరహాలోనే ఏ మాత్రం రెస్పాండ్ కాకుండా కొత్త స్టైల్ ని చూపించారు.

ఇప్పటిదాకా ఒకటి రెండు పబ్లిక్ మీటింగ్స్ లో తన తల వెంట్రుకను ఎవరూ పీకలేరు అంటూ వచ్చిన జగన్ ఇపుడు అలాంటి పరుష పదాలకు స్వస్తి పలికి నో కౌంటర్ అన్న కొత్త వ్యూహానికి తెర తీశారు అని అంటున్నారు. మరి జగన్ ఇలా సైలెంట్ గా ఉంటే విపక్షాల విపక్షాలకు రీ సౌండ్ ఉండకుండా మరుగున పడిపోతాయా. ఏమో జగన్ స్ట్రాటజీ ఏంటో చూడాలి.