Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులు రూ.9 లక్షల కోట్లు.. కొత్త అప్పులు ఇవ్వొద్దు: కేంద్ర ఆర్థిక శాఖకు వైసీపీ ఎంపీ లేఖ!

By:  Tupaki Desk   |   6 Jan 2023 8:30 AM GMT
ఏపీ అప్పులు రూ.9 లక్షల కోట్లు.. కొత్త అప్పులు ఇవ్వొద్దు: కేంద్ర ఆర్థిక శాఖకు వైసీపీ ఎంపీ లేఖ!
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పులపై గత కొంతకాలంగా ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అప్పులు చేస్తూ పోతే ఏపీకి సైతం శ్రీలంక గతి పట్టడం ఖాయమని హెచ్ఛరిస్తున్నారు. అయినా సరే జగన్‌ ప్రభుత్వం అప్పుల విషయంలో ముందుకే వెళ్తోంది. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ దాడి చేస్తోంది. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే ప్రతిపక్షాల ఉద్దేశమని ఆరోపణలు గుప్పిస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు చెల్లించే పరిస్థితి లేక చేబదుళ్ల మీద రోజులు నెట్టుకొస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు రుణాలకు అనుమతిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేజేతులా నాశనం చేసినవారవుతారని ఎంపీ రఘురామకృఫ్ణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఆరు పేజీల లేఖ రాశారు.

ఈ లేఖలో రఘురామకృష్ణరాజు కొన్ని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తెచ్చారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.46 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి ఏపీకి ఇప్పటికే అనుమతిచ్చారని గుర్తు చేశారు. నాబార్డు, విదేశీ రుణాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ అప్పులకు ఇది అదననమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ ద్వారా తీసుకున్న రుణం ఇప్పటికే రూ.9,03,436.58 కోట్లకు చేరిందని రఘురామ ఆ లేఖలో తెలిపారు. ఈ రూ.9 లక్షల కోట్ల మొత్తం రాష్ట్ర జీఎస్‌డీపీలో 75%కి సమానమని వెల్లడించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వార్షికాదాయం రూ.1.50 లక్షల కోట్లు మాత్రమేనని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇందులో రుణం–వడ్డీల కింద రూ.55 వేల కోట్లు పోతోందని వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ లోటు త్వరలో రూ.50 వేల కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

జగన్‌ ప్రభుత్వం చేసే భారీ ఖర్చులు ప్రభుత్వరంగ సంస్థలు, ఎస్‌పీవీలు, ఇతర సంస్థల ఖాతాల్లో చూపి రెవెన్యూలోటును దాచిపెట్టడంతో కాగ్‌ ఖాతా పుస్తకాల్లో వాస్తవాలు లభించడం లేదని రఘురామకృష్ణరాజు తన లేఖలో తెలిపారు.

ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల ద్వారా 2022 మార్చి 31 నాటికి రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెటేతర రుణాలు తీసుకొందని రఘురామకృష్ణరాజు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలోనూ నాన్‌కన్వర్టబుల్‌ బాండ్లు జారీ చేసి స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.8,305 కోట్ల జగన్‌ ప్రభుత్వం అప్పు తెచ్చిందని రఘురామ తన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖకు గుర్తు చేశారు. అలాగే ఇతరత్రా మార్గాల్లో మరో రూ.12 వేల కోట్లు అప్పు చేసిందన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పరిమితులకు మించి అప్పు చేసినందున ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల నుంచి చేసిన అప్పులను సర్దుబాటు చేసేవరకూ ఏపీకి కొత్త అప్పులకు అవకాశం ఇవ్వొద్దు అని రఘురామకృష్ణరాజు తన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖకు విన్నవించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.