Begin typing your search above and press return to search.
టిప్పు సుల్తాన్ మళ్లీ రచ్చ చేస్తున్నాడు
By: Tupaki Desk | 22 Oct 2017 6:47 AM GMTకొన్ని అంశాలు పైకి మామూలుగా కనిపిస్తుంటాయి కానీ..వాటిని విశ్లేషించి చూసే వారికి అవి పెద్ద అంశాలుగానే కనిపిస్తుంటాయి. అలా ప్రత్యేక ఫోకస్ పెట్టిన కారణంగా....ఇప్పుడు ముఖ్యమంత్రికి - కేంద్ర మంత్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇది పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో కనిపిస్తోంది. వచ్చేనెల 10న జరగాల్సిన టిప్పూ సుల్తాన్ జయంతి సందర్భంగా అధికార - ప్రతిపక్షాల మధ్య ఇప్పుడే వేడి పుట్టింది. జయంతి కార్యక్రమానికి ఆహ్వానితుల విషయంలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం మొదలైంది.
టిప్పూ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఓ ఆహ్వాన పత్రం వేసింది. అందులో కర్నాటకకు చెందిన కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సహాయ మంత్రి అనంతకుమార్ హెగ్డే పేరును ముద్రించింది. దీనిపై హెగ్డే తీవ్ర విముఖత చూపారు. తాను హాజరుకాబోనని మంత్రి తెగేసి చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రొటోకాల్ ప్రకారం అనంతకుమార్ హెగ్డేను ఆహ్వానించామని స్పష్టం చేశారు. అయితే టిప్పూ జయంతి సభకు హాజరుకావడం కాకపోవడం అన్నది ఆయన ఇష్టమని సీఎం అన్నారు. ‘వస్తే వస్తారు లేకపోతే లేదు. కేంద్ర మంత్రిగా గౌరవిస్తూ ఆయనను పిలిచాం. దానిపై నిర్ణయం తీసుకోవల్సింది అనంతకుమారే’ అని సిద్దరామయ్య తేల్చిచెప్పేశారు.
వచ్చేనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పూసుల్తాన్ జయంతి నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర కన్నడ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతకుమార్ హెగ్డేను దీనికి ఆహ్వానించారు. అయితే టిప్పూ సుల్తాన్ అంటే పడని బీజేపీ ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్లో భాగంగానే తనను టిప్పూ జయంతికి ఆహ్వానించవద్దని కేంద్ర మంత్రి హెగ్డే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. టిప్పూ ఓ క్రూరుడని - అనేక మందిని ఊచకోత కోశాడని మంత్రి తీవ్ర విమర్శ చేశారు. అలాంటి అరాచక చక్రవర్తి జయంతికి తాను హాజరుకాబోనంటూ శుక్రవారం ఏకంగా ట్వీట్ చేశారు. ముస్లిం చక్రవర్తి టిప్పూ సుల్తాన్ అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించగానే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. విమర్శలు, నిరసనలు ఎదురైన గత ఏడాది రాష్టమ్రంతటా టిప్పూ జయంతి సభలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ‘టిప్పూ జయంతి’ వివాదం మొదలైంది. బ్రిటిష్ పాలకులపై ఐదుసార్లు యుద్ధం చేసిన ధీశాలి టిప్పూ అని దాన్ని రాజకీయం చేయడం బీజేపీకి తగదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు. ‘గౌరవం కొద్దీ పిలుస్తాం. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం మా విధి. రావడం.. రాకపోవడం అన్నది వారి ఇష్టం’ అని పేర్కొన్నారు.