Begin typing your search above and press return to search.

ఆ పని చేయకుంటే పన్నులు కట్టొద్దంటున్న జడ్జి

By:  Tupaki Desk   |   5 Feb 2016 4:45 AM GMT
ఆ పని చేయకుంటే పన్నులు కట్టొద్దంటున్న జడ్జి
X
కొన్ని అంశాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. తాజాగా ఒక న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన మాట సంచలనంగా మారింది. అవినీతిని నిరోధించటంలో ప్రభుత్వం కానీ విఫలమైతే ప్రజలు పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించటమే కాదు.. అవసరమైతే ప్రజలు పన్నులు కట్టే విషయంలో సహాయ నిరాకరణ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. పన్నులు చెల్లించొద్దని.. తమ డిమాండ్లు తీరే వరకూ ప్రభుత్వానికి నిరసన తెలిపే క్రమంలో ఈ తరహా ఆందోళనలు చేయాలంటూ రాజకీయ నేతలు పిలుపునివ్వటం తెలిసిందే.

ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఇలాంటి పిలుపునిచ్చే రాజకీయ నాయకులు.. తాము అధికారంలోకి రాగానే.. తాము అండగా ఉంటామని భరోసా ఇస్తుంటారు. కానీ.. సదరు న్యాయమూర్తి మాత్రం అవినీతి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పన్నులు కట్టకుండా సహాయ నిరాకరణ చేయాలంటూ పిలుపునివ్వటం గమనార్హం. అయితే.. ఈ తరహా వ్యాఖ్యలు పౌరులకు చట్టపరమైన భద్రత ఇవ్వలేవు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయస్థానాల నుంచి రావటం సరికాదన్న మాట వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. సదరు న్యాయమూర్తి మాటను తీసుకొని ఎవరైనా పన్నులు చెల్లించకుండా ఉంటే..అలాంటి వారి పట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే.. చట్టపరమైన భద్రత ఎంతవరకన్నది పెద్ద ప్రశ్న.అయితే.. ఇంతటి వ్యాఖ్యలు రావటానికి దారి తీసిన కారణాలు చూస్తే..

మహారాష్ట్రకు చెందిన ఎస్సీల్లో ఒక వర్గమైన మాతంగులకు సాయం చేయటానికి ఆ రాష్ట్ర సర్కారు వికాస్ మండలికి నిధుల్ని కేటాయించింది. ఇందులో రూ.385కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు పిర్యాదు వచ్చింది. దీనికి సంబంధించి కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం తాజాగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ న్యాయమూర్తి అరుణ్ చౌదరి ఈ కేసును విచారిస్తూ.. బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. అవినీతిని ప్రభుత్వం నియంత్రించకపోతే పౌరులు పన్నులు ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించారు. అవసరమైతే సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునివ్వటం విశేషం. పిలుపు బాగానే ఉంది కానీ.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా స్పందిస్తే.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉంటాయా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇలాంటి వ్యాఖ్యలకు చట్టబద్ధత ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.