Begin typing your search above and press return to search.

బీజేపీ వీరాభిమాని ఏమన్నది ఆ సీఎం చెప్పారు

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:34 AM GMT
బీజేపీ వీరాభిమాని ఏమన్నది ఆ సీఎం చెప్పారు
X
ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు.. ఆయన్ను వ్యతిరేకించే వారు ఎంతలా విరుచుకుపడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే బహిరంగంగానే తిట్టేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చర్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వారు.. మోడీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనపై ఇప్పటివరకూ అవినీతి మరక లేదంటూ గొప్పగా చెప్పుకునే అంశంపై టార్గెట్ చేసి మరీ.. అవినీతి ఆరోపణలు సంధిస్తున్నారు.

మరికొద్ది వారాల్లో జరగనున్న యూపీ ఎన్నికల నేపథ్యంలో.. మోడీ ప్రత్యర్థులు ఆ రాష్ట్రంలో ప్రచారానికి దిగుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న మోడీకి యూపీ ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. తాజాగా యూపీలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు.

తానో బీజేపీ వీరాభిమాని ఫ్యామిలీని కలిశానని.. 30 ఏళ్లుగా వారు బీజేపీ వైపే ఉన్నారని.. అలాంటి వారు తనతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తప్ప ఏ పార్టీకి అయినా ఓటు వేస్తామని చెప్పారని.. నోట్ల రద్దు నిర్ణయం అనంతరం బీజేపీకి బలమైన మద్దతుదారులుగా నిలిచిన వారు సైతం ఆపార్టీని వ్యతిరేకిస్తున్నారన్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులు.. ఏటీఎంల దగ్గర గంటల కొద్దీ క్యూలలో సాధారణ ప్రజల్ని నిలబెట్టేలా చేసిన మోడీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చేసిందన్నారు.

యూపీ ప్రజలు ఇచ్చిన అత్యధిక ఎంపీ సీట్లతో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న మోడీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ప్రజలు మోడీకి తమ ఓటుతో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్న కేజ్రీవాల్.. యూపీ ఓటర్ల తీర్పు కోసం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ..కార్పొరేట్ల దగ్గర భారీగా లంచాలు తీసుకునే వారని ఆయన ఆరోపించారు. ఇంత భారీగా మోడీపై ఆరోపణలు.. విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ లాంటి అధినేతల మాటలు యూపీ ప్రజల మీద ఎంతమేర ప్రభావితం చేస్తాయన్నది తేలాలంటే కాసిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/