Begin typing your search above and press return to search.

గొడ్డు మాంసంపై కీలక అధికారి పంచ్ ఆన్సర్

By:  Tupaki Desk   |   10 March 2016 5:10 AM GMT
గొడ్డు మాంసంపై కీలక అధికారి పంచ్ ఆన్సర్
X
కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని మీడియా ప్రశ్నలు అడగటం.. తమ అభిప్రాయాల్ని చెప్పే క్రమంలో అదో వివాదంగా మారటం.. అదో చర్చగా మారి.. చివరకు కిందామీదా పడటం ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న అనుభవం. అదే సమయంలో కీలక నేతలు.. అధికారులు విద్యార్థులతో భేటీ అయ్యే సందర్భంలో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా దానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

అలాంటి పరిస్థితుల్ని కొనితెచ్చుకోకూడదనుకున్న ఓ కీలక అధికారి.. అప్రమత్తంగా వ్యవహరించి ఒక విద్యార్థి సంధించిన ప్రశ్నకు సమాదానం చెప్పకుండా జాగ్రత్త పడటమే కాదు.. మరో ప్రశ్నకు తావివ్వకుండా సమాధానం చెప్పుకొచ్చారు. ఆయన సమాధానంలో స్వేచ్ఛగా అభిప్రాయం చెబితే.. తదనంతర పరిస్థితులు ఎలా ఉంటాయన్న మాట వినిపించటం గమనార్హం.

విద్యార్థి అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం చెప్పకున్నా.. ఓపెన్ గా మాట్లాడితే వచ్చే విపత్తును ఆయన చెప్పిన వైనం ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖులు.. కీలక పదవుల్లో ఉండే వారు ఈయనగారి ఐడియాను కొంతకాలం కాపీ కొడితే.. రాజకీయ ప్రయోజనాలకు పావులా మారి బలికాకుండా ఉండే అవకాశం ఉంది. ఇంతకీ ఆ తెలివైన కీలక అధికారి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం.

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి.. గొడ్డు మాంసం మీద ఉన్న నిషేధం మీద మీ అభిప్రాయం ఏమిటంటూ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన సుబ్రమణియన్ తెలివిగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ‘‘గొడ్డు మాంసంపై నిషేధం గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆ అంశంపై మాట్లాడి ఉద్యోగం పోగొట్టుకోవాలని నేను అనుకోవటం లేదు. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే.. దీనికి సమాధానం చెబితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు’’ అంటూ బదులిచ్చారు. ఇలాంటి సమాధానాలకు ఎవరు మాత్రం ఏమనగలరు?