Begin typing your search above and press return to search.

మనోళ్లు ‘5జీ’ ముచ్చట్లు మొదలెట్టేశారోచ్

By:  Tupaki Desk   |   1 March 2017 4:50 AM GMT
మనోళ్లు ‘5జీ’ ముచ్చట్లు మొదలెట్టేశారోచ్
X
దేశ ప్రజలకు 2జీ అందుబాటులోకి రావటానికి చాలా కాలమే పట్టింది. అది వచ్చి.. జనాల్లోకి వెళ్లి.. వాడటం మొదలెట్టి.. బాగా అలవాటు పడుతున్న టైంకి 3జీ వచ్చేసింది. దాన్ని జనసామ్యమంతా వాడదామనుకునే సమయానికి.. ఇంకా 3జీ ఏంది? నేనొచ్చేశా అంటూ 4జీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది. అన్ని టెలికం నెట్ వర్క్ లు 4జీలోకి ఇంకా కదురుకోని వేళలో.. భవిష్యత్ అంతా ముడిపడి ఉందని చెప్పే 5జీ ముచ్చట్లు తెర మీదకు వచ్చేశాయ్.

ఇప్పుడున్న అంచనాల ప్రకారం 2018లో 5జీ ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ దేశంలో నిర్వహించే వింటర్ ఒలంపిక్స్ సందర్భంగా దక్షిణ కొరియా తన దేశంలో 5జీ సేవల్నిఅందించాలని ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే.. 3జీ.. 4జీ సేవల్ని ప్రజలకు పరిచయం చేసే విషయంలో భారత్ వెనుక పడిందని.. కానీ.. 5జీని తీసుకొచ్చే విషయంలో మిగిలిన అగ్ర రాజ్యాల కంటే ముందు ఉండే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న తీపి కబురును చెప్పుకొచ్చారు టెలికాం కార్యదర్శి జేఎస్ దీపక్ చెబుతున్నారు. వివిధ స్పెక్ట్రమ్ ల విక్రయానికి సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ ముందుండేలా పనులకు శ్రీకారం చుట్టనున్నట్లుగా వెల్లడించారు.

తాజా స్పెక్ట్రమ్ వేలంను జులై.. డిసెంబరులో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పరకటించారు. ఇదిలా ఉంటే.. 5జీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రిలయన్స్ జియో వెల్లడిస్తోంది. టెలికం రూపురేఖల్నిమొత్తంగా మార్చేస్తుందన్న అంచనాలున్న 5జీని మిగిలిన వారి కంటే ముందుగా అందించేందుకు వీలుగా జియో.. తన ప్లాన్లను సిద్ధం చేస్తుండటం గమనార్హం. ఈ అంశంపై ఇప్పటికే కసరత్తు మొదలైందని చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 5జీ టెక్నాలజీని ప్రజలకు అందించేందుకు వీలుగా రిలయన్స్.. మరో టెక్ జెయింట్ కొరియా శ్యామ్ సంగ్ తో జత కట్టనున్నట్లు చెబుతున్నారు. 5జీకి అవసరమైన సాంకేతిక సాయాన్ని రిలయన్స్ జియోకు శ్యామ్ సంగ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యంపై ఇరు కంపెనీల మధ్య కీలక చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయని.. ఈ విషయంపై ఒక అవగాహనకు ఇరు కంపెనీలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే జరిగితే.. ప్రపంచంలోని పలు అగ్రరాజ్యాల కంటే 5జీ సేవలు భారతీయులకు అందుతాయనటంలో సందేహం లేదు. అదే జరిగితే.. జనజీవితాల్లో అంతులేని వేగం వచ్చేయటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/