Begin typing your search above and press return to search.

డబుల్ మ్యుటెంట్ కరోనా 18 రాష్ట్రాల్లో 771 రకాల వైరస్ లు!

By:  Tupaki Desk   |   24 March 2021 11:27 AM GMT
డబుల్ మ్యుటెంట్ కరోనా 18 రాష్ట్రాల్లో 771 రకాల వైరస్ లు!
X
దేశంలో కొత్త రకం కరోనా ఆనవాళ్లను కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ లో 771 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా ఉంది. "డబుల్ మ్యుటెంట్( రెండుసార్లు రూపాంతరం చెందే)” రకం అని దానిని పిలుస్తారు. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది.

ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం , ఇంకో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉందని తెలిపింది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది. కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత సార్స్ కొవ్2 కన్సార్టియం.. కరోనా జన్యు క్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించినవి, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని వెల్లడించింది.

మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు తేలిందన్నారు. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది.కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా, దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నారు. మరో వైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.