Begin typing your search above and press return to search.

డ్వాక్రా పొదుపు డ‌బ్బు.. హుష్ కాకి.. నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   7 Oct 2021 10:30 AM GMT
డ్వాక్రా పొదుపు డ‌బ్బు.. హుష్ కాకి.. నిజ‌మేనా?
X
గింజా గింజా పోగేసుకుంటే.. గ‌ద్ద త‌న్నుకుపోయిన‌ట్టు ఉంద‌ట‌.. ఏపీలో డ్వాక్రా మ‌హిళ‌ల ప‌రిస్థితి. వీరి సొమ్మును ఏపీ ప్ర‌భుత్వం వాడేసుకుంద‌నే రూమ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రాష్ట్రంలో కోటిమందికిపైగానే డ్వాక్రా పొదుపు సంఘాల్లో మ‌హిళ‌లు ఉన్నారు. ఈ మ‌హిళ‌ల‌ను రాజ‌కీయంగా చూస్తున్న పార్టీలు.. బాగానే వాడుకుంటున్నాయి. వారి ద‌య‌వ‌ల్లే.. గెలుపు గుర్రం ఎక్కుతున్నాయ‌నే అంచనాలు కూడా ఉన్నాయి. వారికి ఆగ్ర‌హం వ‌స్తే.. ఎంతటి పార్టీ అయినా.. ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఏపీలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. జ‌రిగిన రెండు ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. డ్వాక్రా మ‌హిళ‌లు.. ఎన్నిక‌ల‌ను ఏవిధంగా శాసిస్తున్నారో.. అర్ధ‌మ‌వుతుంది. 2014 ఎన్నిక‌ల్లో అప్ప‌టి ప‌రిస్థితులు బ‌ట్టి.. డ్వాక్రా మ‌హిళ‌లు చంద్ర‌బాబుకు గుండుగుత్త‌గా ఓట్లు వేశారు. దీంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కి అధికారంలోకి వ‌చ్చారు. అయితే.. ఐదేళ్ల ఆయ‌న పాల‌న‌తో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. అనుకున్నారో.. ఏమో.. 2019లో అదే చంద్ర‌బాబుకు మ‌హిళా ఓటు బ్యాంకు దూర‌మైంది.. అధికారం వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో డ్వాక్రా మ‌హిళ‌ల ఖాతాల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌సుపు-కుంకుమ పేరుతో రూ.10 వేల చొప్పున నిధులు వేసినా.. ఆగ్ర‌హాన్ని త‌గ్గించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే.

అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మ‌హిళ‌ల‌కు ప‌ట్టంక‌ట్టారు. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్‌పైనా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వారికి సంబం ధించిన ప‌థ‌కాల అమ‌లు, నిధుల వినియోగం వంటివాటిలో తీవ్ర‌మైన గంద‌ర‌గోళం నెల‌కొంది. డ్వాక్రా విష‌యంలో ప్ర‌భుత్వం ఎలా ముందుకు సాగుతోంద‌నే విష‌యంలో మ‌హిళ‌లు తీవ్ర అయోమ‌యంలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో వారి అప్పులు మొత్తం త‌నే అధికారంలోకి రాగానే తీర్చేస్తాన‌న‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆస‌రా రూపంలో వారికి నిధులు ఇస్తున్నారు. అయితే.. ఎక్క‌డో కొంచెం.. వాళ్ల‌కు డౌట్ వ‌స్తోంది. ఇదే విష‌యం.. గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌గా మారింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి డ్వాక్రా గ్రూప్‌లోనూ 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. వీరంతా ప్ర‌తి ఒక్క‌రూ నెల‌కు రూ.100 చొప్పున పొదుపు చేసుకుంటున్నారు. అంటే.. దీనిని బ‌ట్టి ప్ర‌తి గ్రూప్ నెల‌కు రూ.1000 చొప్పున పొదుపు ఖాతాల్లో జ‌మ చేసుకుంటోంది.అయితే.. ఈ పొదుపు సొమ్మును వీరు జ‌మ చేసుకుంటు న్న బ్యాంకుల నుంచి స‌హ‌కార బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసుకుంటోంద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. అక్క‌డి నుంచి ప్ర‌భుత్వం ఈ సొమ్మును డ్రా చేసుకుంటోంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

దీనిపై గ్రామాల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు మ‌హిళ‌లు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మ‌ల సొమ్మును సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటోంద‌ని.. అంటున్నారు. అయితే.. ఇదే క‌నుక నిజంగా జ‌రిగితే.. మ‌హిళ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనేవిష‌యంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి.. ఈ రూమ‌ర్లు వివాదానికి, ఆరోప‌ణ‌లకు చెక్ పెట్టాల‌ని వారు కోరుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం మౌనంగా ఉంటే.. వ్య‌తిరేక ప్ర‌చారం ఎక్కువై.. దానిని మ‌హిళ‌లు న‌మ్మితే.. త‌ర్వాత‌.. ఏం చేసినా.. ప్ర‌యోజనం ఉండ‌ద‌ని.. వ్య‌తిరేక‌త పెరిగితే.. ప్ర‌భుత్వానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఈ విష‌యంలో మీ ద‌గ్గ‌ర మరింత స‌మాచారం ఉంటే.. కామెంట్ రూపంలో పంపించడం మ‌రిచిపోకండి!