Begin typing your search above and press return to search.

సురేశ్ మృతిపై అనుమానాలు?

By:  Tupaki Desk   |   7 Nov 2019 9:16 AM GMT
సురేశ్ మృతిపై అనుమానాలు?
X
తహసిల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడు సురేశ్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. తహసిల్దార్‌పై పెట్రోలు పోసి నిప్పు పెట్టే సమయంలోనే సురేశ్‌కూ కాలిన గాయాలయ్యాయి. ఆ తరువాత ఆయన నడుచుకుంటూ వెళ్లి పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

అయితే.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ భూవివాదంలో రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో సురేశ్ కోలుకుని విచారణలో వాస్తవాలు చెబితే మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉండేది. కానీ, సురేశ్ ఇప్పుడు మృతి చెందడంతో సురేశ్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయంలో పోలీసు దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.

దీంతో సురేశ్ మరణం పై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆయన మరణం వెనుక కుట్ర ఉందేమోనన్న అనుమానాలను ఆ గ్రామస్థులు వ్యక్తంచేస్తున్నారు. అయితే, పోలీసు భద్రత మధ్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్‌ మరణాన్ని హత్య అనడం కూడా సరికాకపోవచ్చన్న వాదనా ఉంది.

మొత్తానికైతే కేసులో పెద్ద తలకాయలు ఉండడంతో ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ప్రచారాలు నిజమా.. అబద్ధమా.. అనేది తేల్చాల్సింది పోలీసులే. భారీ భూవివాదం కావడం, విధుల్లో ఉన్న ఉద్యోగిని పాశవికంగా చంపిన కేసు కావడంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తారనడంలో సందేహం లేదు. దర్యాప్తులో అన్ని నిజాలూ బయటపడతాయి.