Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలింగ్ పై అనుమాన మేఘాలు!

By:  Tupaki Desk   |   15 Dec 2018 11:08 AM GMT
తెలంగాణ పోలింగ్ పై అనుమాన మేఘాలు!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ లో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌న్న వార్త‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. మొత్తం పోల్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ‌ని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే - ఈ అనుమానాలు కేవ‌లం ఆరోప‌ణ‌లుగా మిగిలిపోవ‌డం లేదు. ప‌లువురు అభ్య‌ర్థులు ఎన్నిక‌ల సంఘం లెక్క‌ల‌నే త‌మ అనుమానాల‌కు ఆధారంగా చూపిస్తున్నారు.

ఈవీఎంలు వ‌చ్చాక చెల్ల‌ని ఓట్ల బెడ‌ద త‌ప్పింది. కాబ‌ట్టి ఎక్క‌డైనా స‌రే అభ్య‌ర్థులంద‌రికీ వ‌చ్చిన ఓట్లు - నోటాకు వ‌చ్చిన ఓట్లు - పోస్ట‌ల్ బ్యాల‌ట్లు అన్నీ క‌లిపితే.. ఆ ఎన్నిక‌ల్లో పోలైన మొత్తం ఓట్లు వ‌స్తాయి. తెలంగాణ‌లో మాత్రం ప్ర‌స్తుతం ఓ విచిత్ర ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మొత్తం పోలైన ఓట్ల‌తో పోలిస్తే.. అభ్య‌ర్థులంద‌రికీ క‌లిపి వ‌చ్చిన ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. సాక్ష్యాత్తూ ఎన్నిక‌ల సంఘం లెక్క‌లే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పోలింగ్ తీరుపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు ప‌రిశీలిస్తే.. కోదాడలో మొత్తం పోలయిన ఓట్లు ఈసీ లెక్కల ప్రకారం 1,92,008. కానీ కౌంటింగ్ తర్వాత అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్లు కలిపితే 1,93,888గా లెక్క తేలాయి. అంటే పోలయిన ఓట్ల కన్నా 1,880 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి..? పైగా ఈ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలిచింది.. కేవలం 756 ఓట్ల తేడాతో.

ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. అసిఫాబాద్ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,60,214 . నోటాతో కలిపి అభ్యర్థులందరికీ వచ్చింది 1,60,790 ఓట్లు. అంటే ఎక్కువగా 576 ఓట్లు లెక్కించారు. అలాగే తుంగతుర్తిలో 1057 ఓట్లు - ఇబ్రహీంపట్నంలో 1267 ఓట్లు,

తాండూరులో 1067 ఓట్లు - అంబర్ పేటలో 452 ఓట్లు కొల్లాపూర్‌ లో 1030 ఓట్లను పోల‌యిన వాటి కన్నా ఎక్కువగా లెక్కించారు. టీఆర్ ఎస్ అత్యంత భారీ తేడాతో గెలిచిన నియోజకవర్గాలు గజ్వేల్ - సిరిసిల్లలో కూడా.. పోలయిన ఓట్లకు.. కౌంటింగ్‌ లో తేలిన ఓట్లకు పొంతన కుదరలేదు.

తెలంగాణ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని చెప్పేందుకు ఈ లెక్క‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్య‌ర్థులు ఈ లెక్క‌ల్ని ప‌ట్టుకొని ఈసీ వ‌ద్ద‌కు ప‌రుగులు తీస్తున్నారు. న్యాయ పోరాటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.