Begin typing your search above and press return to search.

హ‌త్య జ‌రిగిన 12 గంట‌ల త‌ర్వాత వెలుగులోకి లేఖ‌?

By:  Tupaki Desk   |   16 March 2019 4:59 AM GMT
హ‌త్య జ‌రిగిన 12 గంట‌ల త‌ర్వాత వెలుగులోకి లేఖ‌?
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య సంచ‌లనంగా మారింది. ఇంట్లో తానొక్క‌డే ఉన్న వేళ‌.. ఉద‌యం వేళ‌లో చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్న హ‌త్య ఇప్పుడు పెద్ద మిస్ట‌రీగా మారింది. రాజ‌కీయంగా ఒక‌రి మీద ఒక‌రు చేసుకుంటున్న ఆరోప‌ణ‌ల్ని కాసేపు ప‌క్క‌న పెట్టేద్దాం. లాజిక్ గా ఆలోచిద్దాం. చ‌నిపోయింది మామూలు వ్య‌క్తి కాదు. ప్ర‌ముఖ వ్య‌క్తి. సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. స్వ‌యాన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు. ఇంటికి వ‌చ్చిన వారికి కాద‌న‌కుండా సాయం చేసే త‌త్త్వం ఉన్నోడు.

మ‌రి.. అలాంటి వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌కు గురైన‌ప్పుడు రాజకీయ విభేదాల్ని ప‌క్క‌న పెట్టేయాలి. నిజం మీద‌నే దృష్టి పెట్టాలి. నేరం చేసినోడు ఎవ‌రై ఉంటార‌న్న కోణంలో దృష్టి సారించాలి. జ‌రుగుతున్న త‌ప్పుల్ని ఎత్తి చూపాలి. నిజం బ‌య‌ట‌కు రావ‌టానికి వీలుగా లోతైన వాద‌న‌ను వినిపించాల్సిన అవ‌స‌రం ఉంది. విచార‌ణ సంస్థ‌లు సైతం కాద‌న‌లేని రీతిలో నిజాల్ని వెలికి తీయాల్సిన అవ‌స‌రం అంద‌రి మీదా ఉంది.

వివేకానంద హ‌త్య జ‌రిగిన‌ప్ప‌టికి.. ముందుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లుగా ప్ర‌చారం చేసింది ఎవ‌రు? అలా చెప్పాల‌న్న విష‌యాన్ని ఎవ‌రు నిర్ణ‌యించారు? అన్న‌ది కీల‌కం. ఒక వ్య‌క్తి బాత్రూంలో ప‌డిపోయి ఉన్న‌ప్పుడు.. స‌హ‌జ మ‌ర‌ణ‌మా? అస‌హ‌జ మ‌ర‌ణ‌మా? అన్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది. అందునా.. త‌ల వెనుక భాగంలోనూ.. ముఖం మీదా.. చేతి మీదా.. ఇలా శ‌రీరంలోని ప‌లు భాగాల మీద ప‌దునైన గాయాలు క‌నిపిస్తున్న‌ప్పుడు.. రెండు లీట‌ర్ల‌కు పైగా ర‌క్తం కారిపోయిన‌ప్పుడు గుండె పోటుతో మ‌ర‌ణించిన‌ట్లుగా వార్త‌లు ఎందుకు ప్ర‌సార‌మ‌య్యాయి.

ఉద‌యం ఆరు గంట‌ల‌లోపే హ‌త్య జ‌రిగిన‌ప్పుడు.. అనుమానాస్ప‌ద మృతి అని ఉద‌యం ప‌ది గంట‌ల స‌మ‌యంలో.. హ‌త్య అని ప‌న్నెండు దాటిన త‌ర్వాత వార్త‌లు రావ‌టం ఏమిటి? అన్న‌వి కీల‌క‌మైన ప్ర‌శ్న‌లు. ఇవ‌న్ని ఒక ఎత్తు అయితే.. మృత‌దేహాన్ని చూసినంత‌నే పోలీసులు మ‌ర‌ణం ఎలా సంభ‌వించింద‌న్న విష‌యాన్ని ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది.. వివేకానంద రెడ్డి విష‌యంలో పోలీసులు సైతం హ‌త్య ప్ర‌క‌ట‌న‌ను ఆల‌స్యంగా ఎందుకు బ‌య‌ట‌కు తెచ్చార‌న్న‌ది మ‌రో సందేహం.

ఒక ప్ర‌ముఖుడి అస‌హ‌జ మ‌ర‌ణం చోటు చేసుకున్న‌ప్పుడు.. ఆ ఇంటిని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తారు. అనుమానం వ‌చ్చిన ప్ర‌తి వ‌స్తువును సీజ్ చేస్తారు. అలాంటప్పుడు వివేకానంద రాసిన‌ట్లుగా చెబుతున్న లేఖ.. ప‌న్నెండు గంట‌ల ఆల‌స్యంగా బ‌య‌ట‌కు రావ‌టంలో అర్థం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. స‌ద‌రు లేఖ‌లో డ్రైవ‌ర్ ప్ర‌సాద్ ను నిందితుడిగా పేర్కొన్నారు. స‌ద‌రు లేఖ‌లో.. ‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని రాసి ఉన్న‌ట్లు చెబుతున్నారు.

గొడ్డ‌లితో వేట్లు ప‌డిన వ్య‌క్తి లేఖ రాసే ప‌రిస్థితి ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రో అనుమానాస్ప‌ద విష‌యం ఏమంటే.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌సాద్ పులివెందుల‌కు చెందిన వాడు. ఒక‌టిన్న‌ర నెల‌లుగా వివేకాకు సేవ‌లు అందిస్తున్నారు. వివేకా లాంటి ముఖ్య‌మైన నేత‌కు కారు డ్రైవ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌టం అంటే.. చాలా అంశాల్ని చెక్ చేసుకునే ప‌నిలో పెట్టుకుంటారే కానీ ఆషామాషీగా పెట్టుకోరు. ఇంత‌కీ డ్రైవ‌ర్ ప్ర‌సాద్ ను వివేకాకు డ్రైవ‌ర్ గా ప‌ని కుదిర్చిన వారు ఎవ‌రు? అన్న‌ది మ‌రో సందేహంగా మారింది. ఒక కారు డ్రైవ‌ర్ వివేకా లాంటి వ్య‌క్తిని చ‌చ్చేట‌ట్లు కొడ‌తాడా? అంత ధైర్యం చేస్తాడా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. మ‌రి.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రావాల్సి ఉంది. నిజం బ‌య‌ట‌కు రావ‌ట‌మే వివేకానంద‌రెడ్డికి ఇచ్చే అస‌లుసిస‌లైన నివాళి.