Begin typing your search above and press return to search.

మావోల లేఖపై అనుమానాలు...వారు చేసిందేనా..?

By:  Tupaki Desk   |   9 March 2022 9:52 AM GMT
మావోల లేఖపై అనుమానాలు...వారు చేసిందేనా..?
X
విశాఖ జిల్లా ఏజెన్సీలో మళ్ళీ ఒక కుదుపు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత మావోల నుంచి ఘాటు లేఖ ఒకటి వచ్చింది. ఒక విధంగా కఠిన హెచ్చరికతో ఆ లేఖ విడుదల అయింది. ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట వచ్చిన ఈ లేఖ పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని టార్గెట్ చేసింది. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల‌ని, ఏకంగా ఏజెన్సీ విడిచి వెళ్ళిపోవాలని అందులో పేర్కొన్నారు.

భాగ్యలక్ష్మి బాక్సైట్ తవ్వకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అన్నది మావోల అభియోగం. ఈ లేఖ విడుదల అయిన దగ్గర నుంచి అధికార పార్టీలో విస్తృతమైన చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే భాగ్యలక్ష్మిది రాజకీయ కుటుంబమే. ఆమె తండ్రి చిట్టినాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె కూడా మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె దాదాపుగా అర లక్షకు దగ్గరగా మెజారిటీ సాధించారు. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఎమ్మెల్యే ఉంటారు అని చెబుతారు. ఇక ఆమె మన్యం అంతా చాలా ఫ్రీగా తిరుగుతారు. ఈ రోజు వరకూ ఆమెకు ఎలాంటి బెదిరింపులూ మావోల నుంచి లేవు. అయితే ఒక్కసారిగా వచ్చిపడిన హెచ్చరిక లేఖతో ఆమెతో పాటు ఏజెన్సీలోని అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు సైతం కలవరపడుతున్నారు.

దీని మీద భాగ్యలక్ష్మి అయితే మామూలుగానే రియాక్ట్ అయ్యారు. విశాఖ ఏజెన్సీలో ఎలాంటి బాక్సైట్ తవ్వకాలూ జరగడం లేదని ఆమె పేర్కొన్నారు. కేవలం రోడ్ మెటల్ పనుల కోసం మాత్రమే మైనింగ్ జరుగుతోందని వివరించారు. గత మూడేళ్ళుగా బాక్సైట్ అన్న మాటే లేదని చెబుతున్నారు. అలాంటపుడు తాను మైనింగ్ మాఫియాను ప్రోత్సహించానూ అని ఆరోపించడంలో అర్ధం లేదని అంటున్నారు.

ఈ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె అంటున్నారు. నిజంగా మావోలు లేఖ రాశారా లేక నకిలీ లేఖా అన్నది చూడాలని ఆమె అన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాటలను బట్టి చూస్తే మావోలు లేఖ రాయలేదని డౌట్లు ఉన్నాయని తెలుస్తోంది. అదే టైమ్ లో ఎవరు రాశారో అన్నది ఇపుడు ఉత్కంఠగా ఉంది.

ఇక ఈ మధ్య కాలంలో తరచూ టీడీపీ నేతలు అయితే ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు వస్తే తాము నిరూపిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు. మరి ఇది వైసీపీ టీడీపీల మధ్య ఎపుడూ జరిగే రాజకీయ యుద్ధంగానే అంతా చూస్తున్నారు. అయితే ఇపుడు మావోల పేరిట లేఖ రావడంతో కొత్త సందేహాలు కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మావోల పేరిట గతంలో కూడా నకిలీ లేఖలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిని మావోలు చూసి ఖండించిన పరిస్థితి కూడా ఉంది. మరిపుడు పోలీసులు ఒక వైపు లేఖ ఎక్కడ నుంచి వచ్చింది అని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మావోల నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందా అన్నది చూడాలి. తామే లేఖ రాశామని మావోలు ప్రకటించుకుంటే మాత్రం అధికార పార్టీకి ఏజెన్సీలో గట్టి ముప్పు పొంచి ఉందని అర్ధం చేసుకోవాలి.

ఏది ఏమైనా ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఏజెన్సీలో మొత్తం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు భద్రతను ఒక్కసారిగా పెంచేశారు. గతంలో మాదిరిగా ఎక్కడపడితే అక్కడ సంచరించరాదు అని కూడా సూచనలు చేశారని భోగట్టా. మొత్తానికి చూస్తే విశాఖ ఏజెన్సీలో మావోల ఉనికి గట్టిగానే ఉంది అంటున్నారు. దాంతో లేఖ నకిలీ అయి ఉండదు అన్న మాట కూడా వినిపిస్తోంది. దీంతో అధికార పార్టీలో అయితే కొత్త బెంగ పట్టుకుంది. గతంలో మాదిరిగా ఇక మీదట తాము స్వేచ్చగా తిరగలేమని వారు వాపోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.