Begin typing your search above and press return to search.

సింగిల్ యాడ్‌ తో...డ‌వ్ వివాదంలో చిక్కుకుందే!

By:  Tupaki Desk   |   9 Oct 2017 10:59 AM GMT
సింగిల్ యాడ్‌ తో...డ‌వ్ వివాదంలో చిక్కుకుందే!
X

సౌంద‌ర్యానికి సంబంధించిన ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న డ‌వ్ సంస్థ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. తాను రూపొందించిన ఓ కొత్త సోప్‌కు సంబంధించి ఆ సంస్థ ఫేస్ బుక్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ యాడే ఆ సంస్థ‌ను ఆ వివాదంలోకి నెట్టేసింద‌ని చెప్పాలి. సాధార‌ణంగా బ‌హుళ జాతి సంస్థ‌లుగా ఉన్న ప్ర‌ముఖ బ్రాండింగ్ సంస్థ‌లు... తమ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి రూపొందుతున్న యాడ్‌ల‌ను ఒక‌టికి ప‌దిమార్లు ప‌రిశీలించుకుని కాని విడుద‌ల చేయ‌వు. ఎందుకంటే... ఏ ఒక్క దేశంలోని ప్ర‌జ‌ల‌ను ఆ యాడ్ కించ‌ప‌రిచేదిగా ఉన్నా... మొత్తం అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతాయి. గ‌తంలో అయితే ఏమో గాని... సోష‌ల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో అయితే ఈ త‌ర‌హా ప్ర‌మాదం చాలా ఎక్కువ‌గానే ఉంది. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని డ‌వ్‌... త‌న ఉత్ప‌త్తుల కోసం రూపొందుతున్న యాడ్‌ల‌ను ఏమాత్రం ప‌రిశీలించుకోకుండానే విడుద‌ల చేస్తోంద‌ని ఆ ఒక్క ఘ‌ట‌న‌తోనే తేలిపోయింద‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఇటీవ‌లి త‌న ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసుకునే క్ర‌మంలో డ‌వ్ ఓ యాడ్‌ను ఫేస్ బుక్ వేదిక‌గా పోస్ట్ చేసింది. స‌ద‌రు యాడ్‌లో ఓ న‌ల్ల జాతి మ‌హిళ‌... డ‌వ్ వాడిన త‌ర్వాత తెలుపు రంగు క‌లిగిన మ‌హిళగా మారిన‌ట్లుగా ఉంది. ఒంటికి వేసుకున్న టీ ష‌ర్ట్‌ను తీసేసిన న‌ల్ల మ‌హిళ‌... ఆ ష‌ర్ట్ విప్ప‌గానే శ్వేత మ‌హిళ‌గా మారిన‌ట్లు ఆ యాడ్ చూపింది. అంటే త‌న స‌బ్బును వాడిన వారు తెల్ల‌గా మారుతార‌ని డవ్ ఉద్దేశం కావ‌చ్చు. అయితే... న‌ల్ల జాతీయుల‌ను త‌క్కువ‌గా, శ్వేత జాతీయుల‌ను ఎక్కువ‌గా చేసి చూపిన‌ట్లుగా ఈ యాడ్ ఉందంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినా శ‌రీరం రంగును బేస్ చేసుకుని యాడ్‌ లు విడుద‌ల చేయ‌డ‌మంటే... న‌ల్ల జాతీయుల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని కూడా కొంద‌రు నెటిజ‌న్లు భావించి... డ‌వ్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో దెబ్బ‌కు దిగి వ‌చ్చిన డ‌వ్‌... స‌ద‌రు యాడ్‌ కు సంబంధించిన ఓ వివ‌ర‌ణ‌ను విడుద‌ల చేయ‌క త‌ప్ప‌లేదు.

మూడు సెకన్లతో కూడిన ఓ వీడియో క్లిప్‌ ను డవ్‌ విడుదల చేసింది. ఈ క్లిప్‌ లో నిజమైన అందంపై డవ్‌ వైవిధ్యాన్ని చూపించడం లేదని, దీనిపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్టు ఆ సంస్థ సారీ చెప్పేసింది. ఇక ఈ యాడ్‌పై నెటిజ‌న్లు ఏమంటున్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. నల్ల జాతీయురాలు, తెల్ల జాతీయురాలుగా మారే విధంగా చూపించే ఈ సబ్బు ప్రకటన జాత్యహంకారాన్ని కలిగి ఉందని నెటిజ‌న్లు అంటున్నారు. అంటే నల్ల రంగు శరీరం చెత్త అని, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదని ఈ యాడ్‌ ప్రతిపాదిస్తుందని విమర్శిస్తున్నారు. శుభ్రమైన శరీరమంటే - తెల్ల రంగు శరీరం కాదని - అలా అని నల్ల రంగు శరీరాలన్నీ చెత్త కాదని అట్లాంటకు చెందిన ఓ ప్రొఫెసర్ ఆస‌క్తిక‌ర‌మైన‌ ట్వీట్‌ చేశారు. డవ్‌ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని, కానీ ప్రస్తుతం వీటిని విడిచిపెడుతున్నట్టు స‌ద‌రు ప్రొఫెస‌ర్... డ‌వ్ సంస్థ‌కు షాకిచ్చే ప్ర‌క‌ట‌న చేశారు. వెర‌సి ఒక్క యాడ్ తో డ‌వ్ పెను విమ‌ర్శ‌లు ఎదుర్కోక త‌ప్ప‌లేద‌న్న మాట‌.