Begin typing your search above and press return to search.

సినీ నటికి రెండేళ్లు జైలు.. ఆమె చేసిన తప్పేమంటే?

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:45 AM GMT
సినీ నటికి రెండేళ్లు జైలు.. ఆమె చేసిన తప్పేమంటే?
X
సినీ నటి ఒకరికి రెండేళ్లు జైలుశిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది. ఆ నటి మరెవరో కాదు.. సీనియర్ నటిగా గుర్తింపు పొందిన కన్నడ నటి అభినయకు రెండేళ్లు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

అదే కేసులో ఆమె సోదరుడికి మూడేళ్లు.. ఆమె తల్లికి ఐదేళ్లు.. మరో సోదరుడికి రెండేళ్ల జైలును న్యాయమూర్తి విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఇంతకూ అంతటి శిక్ష పడేలా నటి అభినయ ఏం తప్పు చేసిందన్న విషయంలోకి వెళితే.. కట్నం కోసం వదినను వేధింపులకు గురి చేసినట్లుగా చెబుతున్నారు.

అభినయ సోదరుడు శ్రీనివాస్. అతడికి లక్ష్మీదేవితో వివాహమైంది. వీరి పెళ్లి 1998లో జరగ్గా.. పెళ్లి వేళ లాంఛనాల రూపంలో రూ.80 వేల క్యాష్.. పావు కేజీ ఆభరణాల్ని ఇచ్చారు. పెళ్లైన తర్వాత ఆమెను పుట్టింటికి వెళ్లి మరో రూ.లక్ష తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేశారు. ఈ వేధింపులకు పాల్పడిన వారిలో సినీ నటి అభినయతో పాటు.. ఆమె ఇద్దరు సోదరులు.. తల్లి కూడా ఉన్నారు.

దీంతో.. వారి వేధింపులు తట్టుకోలేని లక్ష్మీదేవి 2002లో బెంగళూరులోని చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.

కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు విచారణ జరిపారు. పెళ్లైన ఆరె నెలల నుంచే అత్తింటి తరఫున వేధింపులు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసు సుదీర్ఘంగా సాగి తాజాగా తీర్పును ఇచ్చారు. ఈ కేసు వాదనల సమయంలో నటి అభినయ వదిన లక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు.

అభినయ అప్పటికే సినీ నటి కావటంతో ఇంటికి ఎవరెవరో వచ్చేవారని.. అలా వచ్చే వారికి సహకరించాలని తనపై తరచూ ఒత్తిడి తెచ్చే వారన్నారు. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగినప్పటికీ.. తాజాగా వచ్చిన తీర్పు విషయంలో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.