Begin typing your search above and press return to search.

జగన్ పేషీలో హరికృష్ణ... విధేయతకు అందలం దక్కింది

By:  Tupaki Desk   |   7 Jun 2019 4:17 PM GMT
జగన్ పేషీలో హరికృష్ణ... విధేయతకు అందలం దక్కింది
X
చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ హరికృష్ణ పేరు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు గానీ... ఇకపై ఈ పేరు అందరికీ బాగానే పరిచయం అవడం ఖాయమే. ఎందుకంటే నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేషీలో హరికృష్ణ కీలక భూమిక పోషించనున్నారు. ఇప్పటికే తన పేషీలో ఎవరెవరు ఉండాలన్న విషయంపై పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చిన జగన్... తన వెన్నంటి నడిచిన హరికృష్ణను కూడా తన పేషీలో నియమించుకున్నారు. అయినా ఈ హరికృష్ణ ఎవరు? ఎక్కడివారు? వైఎస్ ఫ్యామిలీతో ఆయన అనుబంధం ఏమిటన్న వివరాల్లోకెళితే... కథ కాస్తంత నిడివి ఎక్కువగానే ఉన్నా... ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.

ఏపీ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని కొడిగినహళ్లికి చెందిన హరికృష్ణ... అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం లయోలా కాలేజీలో ఇంటర్ ను పూర్తి చేసిన ఆయన రాయలసీమ ముఖద్వారా కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్స్ కోర్సును పూర్తి చేసిన హరికృష్ణ... వైద్య విద్యార్థిగా ఉండగానే తనదైన శైలి నాయకత్వ పటిమ చూపారు. ఏపీ జూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తన సొంతూరికి దగ్గరగా ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైద్యుడిగా సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైద్య సేవలను వదిలేసి వైఎస్ ఫ్యామిలీతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఆయన వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా జరిగారు. తదనంతర పరిణామాల్లో రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందినా.. వైఎస్ ఫ్యామిలీతో అనుబంధాన్ని కొనసాగించిన హరికృష్ణ... వైఎస్ తనయ వైఎస్ షర్మిల కొనసాగించిన పాదయాత్రలో ఆమె వెన్నంటి నడిచారు. షర్మిలతో 3,112 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగించిన హరికృష్ణ... ఆ తర్వాత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ వెంట 3,648 కిలో మీటర్లు అలుపన్నదే ఎరుగకుండా నడిచారు. నిజాయతీ, అంకితభావం, విధేయతలే హరికృష్ణను వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్ని్హితుడిని చేసిందని చెప్పాలి. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీకి వీర విధేయులుగా నిలిచిన భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబాలకు సమీప బంధువు అయిన హరికృష్ణ.. మరింతగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

అయితే ఆ తర్వాత భూమా, ఎస్వీ ఫ్యామిలీలు వైసీపీని వీడినా హరికృష్ణ మాత్రం వెన్నంటి నడిచారు. పాదయాత్రలో జగన్ కు అందిన ప్రతి విన్నపాన్ని చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టిన హరికృష్ణ... ఎప్పటికప్పుడు వాటిని జగన్ కు అందిస్తూ సాగారు. అంతేకాకుండా పార్టీలో అత్యంత రహస్య సమాచారాన్ని కూడా జగన్ కు చేరవేయడం, జగన్ నుంచి అదే రహస్య సమాచారాన్ని పార్టీ నేతలకు చేరవేయడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణకు మరింతగా ప్రాధాన్యం ఇచ్చిన జగన్.... ఆయనను తన పేషీలో నియమించుకున్నారు. అంటే.. వైఎస్ ఫ్యామిలీ పట్ల హరికృష్ణ చూపిన విధేయతే... ఇప్పుడు ఆయనకు జగన్ పేషీలో పనిచేసే అవకాశం దక్కిందన్న మాట.ఎంతైనా విధేయతకు వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తుంది కదా. ఆ క్రమంలోనే ఇప్పుడు హరికృష్ణ కూడా అదే విధేయతతో జగన్ మనసును గెలుచుకున్నారని చెప్పక తప్పదు.