Begin typing your search above and press return to search.

కేంద్ర ప్ర‌భుత్వ బిల్లుపై యాంగ్రీ యంగ్‌ మ్యాన్ ఫైర్‌

By:  Tupaki Desk   |   7 Aug 2019 3:11 PM GMT
కేంద్ర ప్ర‌భుత్వ బిల్లుపై యాంగ్రీ యంగ్‌ మ్యాన్ ఫైర్‌
X
వైద్య రంగంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌రికొత్త నిబంధ‌న తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగేళ్లు ఎంబీబీఎస్ చ‌దివిన వారు యేడాది పాటు హౌస్ స‌ర్జ‌న్‌ గా ప్రాక్టీస్ చేస్తే చాలు వాళ్ల చేతికి ప్రభుత్వం డాక్ట‌ర్ ప‌ట్టా చేతికి ఇస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే రూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ‘జాతీయ మెడికల్ కమిషన్’ (ఎన్.ఎం.సి) ద్వారా ఇప్పుడు వైద్య రంగంలో స‌రికొత్త మార్పులు రానున్నాయి.

ఈ మార్పుల ప్ర‌కారం ఆయుర్వేద‌ - యునాని - ఇత‌ర వైద్య విద్య‌లు అభ్య‌సించిన వారు కూడా కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టే ఆరు నెల‌ల కోర్సులో పాస్ అయితే చాలు ఇక‌పై వారు కూడా ఎంబీబీఎస్ డాక్ట‌ర్ల‌లా ప్రాక్టీస్ చేయ‌వ‌చ్చు. అంటే ఎంబీబీఎస్ కోర్సుతో సంబంధం లేకుండా ఇత‌ర వైద్య విద్య‌లు అభ్య‌సించిన వారు కూడా ఇక‌పై ఎంబీబీఎస్ రేంజ్ డాక్ట‌ర్లుగా చ‌లామ‌ణీ అయ్యే వెసులు బాటు వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

ఈ బిల్లును ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రాజ‌శేఖ‌ర్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఉన్న జూనియ‌ర్ డాక్ట‌ర్లు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో పాటు రెడ్లెక్కి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ బిల్లుపై ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఏ న‌టీన‌టులు కూడా స్పందించ‌లేదు. రాజ‌శేఖ‌ర్ దీనిపై ట్వీట్ చేయ‌డంతో ఇది మ‌రింత‌గా వెలుగులోకి వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఇక రాజ‌శేఖ‌ర్ స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. వైద్య రంగంలో ఏ రంగానికి ఆ రంగంలో ప్ర‌త్యేక కోర్సులు ఎందుకు ఉంటాయి ? ఎంబిబిఎస్ చదివి - తరవాత హౌస్ సర్జన్ చేయడం మామూలు విషయం కాదు... కేవ‌లం ఆరు నెల‌ల క్రాష్ కోర్సు చ‌దివేసి సుల‌భంగా డాక్ట‌ర్లు కావ‌చ్చు ? అంటే ఎలా కుదురుతుంద‌ని ప్ర‌శ్నించారు.

ఇలాంటి డాక్ట‌ర్ల వ‌ల్ల ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని... ఇలాంటి బిల్లును అంద‌రూ వ్య‌తిరేకించాల‌ని రాజ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జారోగ్యానికి ప్ర‌మాదంగా ఉన్న ఈ బిల్లును ఓ డాక్ట‌ర్‌ గా తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని కూడా ఆయ‌న తెలిపారు.