Begin typing your search above and press return to search.

మాజీ తమ్ముళ్ళకు శఠగోపమేనా... ?

By:  Tupaki Desk   |   14 July 2021 5:35 AM GMT
మాజీ  తమ్ముళ్ళకు శఠగోపమేనా... ?
X
తెలుగుదేశం పాటీ ఇలా ఓడిపోగానే అలా వైసీపీలోకి దూకేసిన విశాఖ మాజీ ఎమ్మెల్యేలకు ఫలితం దక్కే సూచనలు కనిపించడంలేదు. వారంతా ఇపుడు చెప్పాలంటే అక్కడ గోళ్ళు గిల్లుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎస్ ఎ రహమాన్. పంచకర్ల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి, పిన్నింటి వరలక్ష్మి వంటి వారు ఇపుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే అధికార పార్టీలో ఉన్నామని సంతృప్తి చెందడమే తప్ప పార్టీ నుంచి వారికి దక్కేది ఏమీ లేదని తేలిపోతోంది. జగన్ ప్రాధాన్యతలు వేరు. దాంతో వారు అసలు విషయం తెలుసుకుని ఖంగు తింటున్నారుట.

వారికి పార్టీ పదవులు లేవు, ఇతరత్రా నామినేట్ పదవులు కూడా వరించే అవకాశాలు అసలు లేవు. దాంతో ఎందుకు వచ్చామని ప్రతి నిత్యం ఒకటికి పదిసార్లు అనుకోవాల్సిందే. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వైసీపీ తెలివిగా వీరిని ట్రాప్ చేసింది. యేడాదిన్న‌ర‌ క్రితం విశాఖ రాజధాని మీద తెలుగుదేశం రచ్చ చేసింది. దాంతో టీడీపీ నుంచే పెద్ద తలకాయలను కొందరిని లాగేసి మరీ పసుపు పార్టీ నోరు మూయించింది. తమ్ముళ్ళే విశాఖ రాజధానిని ఒప్పుకుంటున్నారు అన్న లాజిక్ పాయింట్ తో అటు జనాలకు, ఇటు టీడీపీకి ఒకేసారి జవాబు చెప్పేసింది.

అలా అధికార పార్టీలోకి వచ్చి వైసీపీ రాజకీయ అవసరాలకు తాము ఉపయోగపడ్డామని ఇపుడు వారు మద‌న పడుతున్నారు. జగన్ సమీకరణలు, ఆయన ఆలోచనలు చూసుకుంటే కనుక తనతో పాటు పదేళ్ళుగా ఉన్నవారికే అవకాశాలు ఇస్తారు. విధెయతకు ఆయన పెద్ద పీట వేస్తారు. దాన్ని తెలుసుకోకుండా ఎన్నో అవకాశాలు ఇచ్చిన టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారి మీద జగన్‌కి ఏ రకమైన అభిప్రాయం ఉంటుంది అన్న మాట అయితే ఉంది.

పైగా ఇవాళ వైసీపీ అధికారంలో ఉంది. రేపు ఏమైనా సీన్ మారితే వీరంతా మళ్లీ టీడీపీలోకే వెళ్తారు అన్న ఆలోచనకు కూడా వైసీపీ పెద్దలకు ఉన్నాయట. అదే విధంగా వచ్చిన వారు కూడా పెద్దగా సౌండ్ చేయకుండా ఉండడం వంటివి గమనించే వారిని సైడ్ చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి వీరికి పదవీ యోగం ఎప్పటికైనా ఉందో లేదో.