Begin typing your search above and press return to search.

వన్ టైమ్ ఎంపీగానే డాక్టరమ్మ....?

By:  Tupaki Desk   |   16 Jan 2022 11:30 PM GMT
వన్ టైమ్ ఎంపీగానే డాక్టరమ్మ....?
X
రాజకీయాల్లోకి వచ్చే ముందే ఆమె సేవా భావం కలిగిన మహిళా నాయకురాలు. పైగా ఆమె డాక్టర్ వంటి మంచి ప్రొఫేషన్ లో ఉన్నారు. ఆమె రాజకీయాలలో చూస్తే కాంగ్రెస్ లో ఒక మామూలు నాయకురాలిగా ఉంటూ ఆ 2019 ఎన్నికల కంటే కొద్ది కాలం ముందు వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు వైసీపీ తరఫున ఎవరూ సరైన అభ్యర్ధి లేకపోవడంతో ఆమె పేరుని చివరి నిముషంలో జగన్ ఖరారు చేశారు. ఇక ఆమెకు లక్కీ చాన్స్ అలా వచ్చేసింది.

అవతల వైపు క్యాండిడేట్ రాజకీయాల్లో మంచి పలుకుబడి కలిగిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్. ఆయన టీడీపీ తరఫున ఎంపీ పోటీలో ఉంటే వైసీపీ నుంచి డాక్టర్ సత్యవతి రెడీ అయ్యారు. జగన్ వేవ్ ఆనాడు గట్టిగా ఉండడంతో అనూహ్యంగా ఆమె గెలిచారు. దాంతో ఎకాఎకీన ఎంపీ అయిపోయారు. అలా సత్యవతి గత మూడేళ్ళుగా పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు.

అయితే ఆమె రాజకీయంగా దూకుడు చేసే నేత కారు. అలాగే ఆమె పార్టీ నేతలతో కలసిపోయే రకం కారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక రూరల్ జిల్లా వైసీపీలో వర్గాలు ఉన్నాయి. దాంతో ఆమె ఏదో విధంగా నెట్టుకువస్తున్నారు. స్థానికంగా ఉన్న అనేక సమస్యల మీద కూడా ఆమె సరైన తీరున పరిష్కారం చూపలేదు అన్న విమర్శలు ఉన్నాయి. అనకాపల్లి బెల్లం మార్కెట్ కి ప్రసిద్ధి. దాన్ని అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర సాయాన్ని కోరుతున్నారు. ఈ విషయం మీద ఆమె గట్టిగా పోరాడడంలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.

మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆమెకు ఇస్తారా అన్న చర్చ అయితే బయల్దేరింది. సత్యవతి బలమైన సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ ఆ వర్గం నుంచే పోటీ ఉంది. గతంలో ఆమె గెలుపునకు పనిచేసిన వారు ఈసారి చేస్తారా అన్నదే చర్చ. ఇంకో వైపు చూస్తే టీడీపీ మీద నాడు ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆడారి ఆనంద్ ఈసారి వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీకి పోటీ చేస్తారు అంటున్నారు.

ఆయన రెండేళ్ళ క్రితమే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దాంతో ఆయనకు ఉన్న అంగ బలం, అర్ధబలం అన్నీ బేరీజు వేసుకుని అధినాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపుతోంది అంటున్నారు. అదే జరిగితే మాత్రం కచ్చితంగా డాక్టరమ్మ వన్ టైమ్ ఎంపీగానే మిగిలిపోతారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.