Begin typing your search above and press return to search.

డాక్టర్ త్రినేత్ర.. ఆమెకున్న రికార్డు సౌత్ లో మరెవరికీ లేదు

By:  Tupaki Desk   |   21 Nov 2020 1:10 PM GMT
డాక్టర్ త్రినేత్ర.. ఆమెకున్న రికార్డు సౌత్ లో మరెవరికీ లేదు
X
గతం గురించి అదే పనిగా ఆలోచించకుండా.. వర్తమానంలో కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. అవమానాలు తాత్కాలికమైనవన్న విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మాటలు చెప్పటం తేలికే కాదు. కానీ.. సమస్యల్ని.. ఆటుపోట్లను ఎదుర్కొని రాటుదేలినప్పుడే అద్భుత విషయం సొంతమవుతుంది. అందరిలోనూ భిన్నంగా నిలుపుతుంది. నీ ప్రత్యేకత ఏమిటన్నది లోకానికి తెలిసేలా చేస్తుంది. ఇలాంటివన్నీ డాక్టర్ త్రినేత్రను చూసినంతనే అనిపించకమానదు.

ఎందుకంటే డాక్టర్ త్రినేత్ర.. అందరిలాంటి డాక్టర్ ఎంతమాత్రం కాదు. గతంలో ఆమె పేరు అంగద్ గమ్మరాజు. అవును.. లింగమార్పిడి చేసుకొన్న తొలి మహిళా డాక్టర్ ఆమే. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆమె చిన్నతనంలో (అప్పట్లో అతడు) ఎన్నో అవమానాల్ని.. బాధల్ని ఎదుర్కొనేవాడు. అసభ్యకర పేర్లతో ఏడిపించేవారు. అవన్నీ ఎంత వద్దనుకున్నా వెంటాడుతూనే ఉండేవి. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ.. లక్ష్యం మీద ఫోకస్ చేసిన ఆమె చివరకు మెడిసిన్ పూర్తి చేశారు.

తాజాగా హాస్పిటల్ ప్రాక్టికల్ సెషన్ లో ఒక మహిళకు ప్రసవాన్ని చేయటాన్ని ప్రస్తావిస్తూ.. తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలుగా ఆమె అభివర్ణిస్తారు. ‘ఒక మహిళకు ప్రసవాన్ని చేశాను. ఆ బిడ్డను నా చేతుల్లో తీసుకున్న క్షణ జీవితంలో మర్చిపోలేనిది. నా గతం ఓ విషాదం. నేను ఇప్పుడో డాక్టర్ ను’’ అంటూ చెప్పే ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది.
ప్రస్తుతం మణిపాల్ లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్ లో పని చేస్తున్న ఆమె.. దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక ట్రాన్స్ జెండర్ డాక్టర్. ఈశాన్యభారతంలో బియాన్సీ లాయిష్ రామ్ మొదటి ట్రాన్స్ జెండర్ వైద్యురాలిగా రికార్డుల్లోకి ఎక్కారు. సౌత్ లో మాత్రం డాక్టర్ త్రినేత్రనే.