Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఎమ్మెల్యే అల‌క‌.. అధిష్టానం ట్రీట్‌మెంట్‌!!

By:  Tupaki Desk   |   20 April 2022 12:30 AM GMT
మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఎమ్మెల్యే అల‌క‌.. అధిష్టానం ట్రీట్‌మెంట్‌!!
X
వైసీపీలో చాలా మంది నాయ‌కులు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు కూడాఅమాత్యా అని అనిపించుకుందామ‌ని అనుకున్నారు. అయితే.. వ‌చ్చేఎన్నిక‌ల ర‌ణ‌రంగాన్ని దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాద‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతారు.. అని ముందుగానే ఉప్పంద‌ని నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టార‌నే టాక్ కూడా వైసీపీలో వినిపించింది. ఇలాంటి వారు కొంత ఆవేద‌న చెందారు. మ‌రింత మంది..ఇంకా.. కేబినెట్ షాక్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయ‌కురాలు.. డాక్ల‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కూడా ఉన్నారు.

``నేను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాను. మాది సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న కుటుంబం. రాజ‌ధాని విష యంలో జ‌గ‌న్ నిర్ణ‌యానికి సంపూర్ణ మద్ద‌తిచ్చాను. అమ‌రావ‌తి రైతుల‌ను తిట్టాను.. తిట్టించుకున్నాను. ఇంత చేసినా.. నాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు`` అని శ్రీదేవి త‌న అనుచ‌రుల వ‌ద్ద వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఆవెంట‌నే ఆమె నియోజ‌క‌వ‌ర్గానికి బై చెప్పి.. హైద‌రాబాద్ వెళ్లిపోయారు. నిజానికి వృత్తి రీత్యా వైద్యురాలైన ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. తండ్రి.. గ‌తంంలో రాజ‌కీయాలు చేసిన మాట నిజ‌మే. ఒకసారి ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. హైద‌రాబాద్‌లో వైద్య వృత్తిలో ఉన్న శ్రీదేవిని తీసుకువ‌చ్చి.. తాడికొండ సీటిచ్చా రు. నిజానికి ఈమె జ‌గ‌న్ సునామీలో కొట్టుకువ‌చ్చార‌ని.. వైసీపీలోనే టాక్ ఉంది. అయితే.. అటు అసెంబ్లీ లోను.. ఇటు బ‌య‌ట కూడా.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం.. ప్ర‌తిప‌క్షంపై విరుచుకుప‌డడం వంటి రాజ కీయాలు చేసేవారిలో.. శ్రీదేవి కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె మంత్రిప‌ద‌విని ఆశించారు. ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌ను తొల‌గించాక‌.. త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని శ్రీదేవి బాగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ, మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆమె హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేశారు. క‌నీసం.. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హించిన వైసీపీ అదిష్టా నం.. ఆమెకు గ‌ట్టి ట్రీట్‌మెంటే ఇచ్చిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నార‌ని.. అయినా.. పార్టీ కోసం మీరు ఏం చేశార‌ని.. ప‌ద‌విఇవ్వాలి? అని.. ఒక కీల‌క స‌ల‌హాదారు ప్ర‌శ్నించిన‌ట్టు శ్రీదేవి వ‌ర్గం కూడా గుస‌గుస‌లాడుతోంది.

పైగా.. సొంత పార్టీ ఎంపీ నందిగం సురేష్‌తో పంచాయ‌తీలు పెట్టుకుని రోడ్డున ప‌డ్డ ప‌రిస్థితిని కూడా.. అధిష్టానం ప్ర‌శ్నించింద‌ని వీరు అంటున్నారు. అంతేకాదు.. ఇలాంటి ధోర‌ణిలోనే ముందుకు సాగితే.. మున్ముందు తీవ్ర ప‌రిణామాలు కూడా త‌ప్ప‌వ‌ని.. హెచ్చరించిన‌ట్టు స‌మాచారం. పార్టీని బ‌లోపేతం చేస్తేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తామ‌ని.. చెప్పేసింద‌ట‌. అంతేకాదు.. అల‌క రాజ‌కీయాల‌కు పార్టీ ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రాధాన్యం ఇచ్చేది లేద‌ని.. తెగేసి చెప్పిన‌ట్టు ఉండ‌వ‌ల్లి వ‌ర్గం చెబుతోంది. దీంతో ఉండ‌వ‌ల్లి అల‌క మొత్తానికే మోసం చేసేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆమె ఏం చేస్తారో చూడాలి.