Begin typing your search above and press return to search.

భారత్ ను రెచ్చగొడుతున్న డ్రాగన్

By:  Tupaki Desk   |   18 April 2022 6:30 AM GMT
భారత్ ను రెచ్చగొడుతున్న డ్రాగన్
X
భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ మళ్ళీ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్ సరిహద్దులో సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. భారత్-చైనా వాస్తవాదీన రేఖ వెంబడే డ్రాగన్ సెల్ టవర్లను ఏర్పాటు చేయటంతో అవి పనిచేయటం కూడా మొదలైపోయింది. దీనివల్ల మన సైన్యం కదలికలతో పాటు మామూలు జనాలకు కూడా ఇబ్బందులు తప్పేట్లు లేదు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ నదిపై ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన చైనా పెద్ద వంతెనను నిర్మించేసిన విషయం తెలిసిందే.

ముందు వంతెనను నిర్మించటం, ఇపుడు సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేయటం చూస్తుంటే రోడ్డు, టెలికమ్యూనికేషన్ వ్యవస్ధను చైనా పటిష్టం చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. గడచిన రెండు సంవత్సరాలుగా గాల్వాన్ లోయలోను, ప్యాంగ్యాంగ్ నది ప్రాంతంలోను ఇప్పటికే డ్రాగన్ సైన్యానికి మన సైన్యానికి చాలాసార్లు గొడవలైన విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. కావాలనే భారత్ సైన్యాన్ని చైనా సైన్యం రెచ్చగొడుతోంది.

తాజాగా చైనా ఏర్పాటుచేసిన సెల్ టవర్లపై చుషుక్ కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ మాట్లాడుతు తమ ప్రాంతంలో భారత్ ప్రభుత్వం 4 జీ సెల్ టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్న సమయంలో డ్రాగన్ 5జీ టవర్లను ఎలా ఏర్పాటు చేయగలుగుతోందని ప్రశ్నించారు.

తాను కౌన్సిలర్ గా ఉన్న 11 గ్రామాల పరిధిలో ఇప్పటికీ 4జీ సౌకర్యం లేదని ఆయన ట్విట్టర్లో చెప్పారు. అయితే జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

చైనా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, సౌకర్యాలు చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదనే మన సైన్యం దీమాగా ఉంది. ఎందుకంటే చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతమంతా కొండలు, లోయలతో నిండిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో కాపలాకాయటం, చలికి తట్టుకోవటం డ్రాగన్ సైన్యం ప్రాంణంమీదకు వస్తోంది.

దీంతో నెలరోజుల పాటు ఉండాల్సిన సైన్యం ఫిష్ట్ కేవలం వారంరోజులకే మారిపోతోంది. కాబట్టి డ్రాగన్ సైన్యం చేసుకునే ఏర్పాట్లేవీ అవసరానికి పెద్దగా పనికిరావని మన సైన్యాధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైనపుడు వాటిని ధ్వంసం చేయటం కూడా ఈజీనే. అందుకనే అవసరమైనపుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది.