Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి రేసులో కొత్త పేరు.. ద్రౌప‌తి!

By:  Tupaki Desk   |   5 May 2017 7:22 AM GMT
రాష్ట్రప‌తి రేసులో కొత్త పేరు.. ద్రౌప‌తి!
X
మ‌రికొద్ది రోజుల్లో జ‌ర‌గాల్సిన రాష్ట్రప‌తి రేసుకు సంబంధించి ప‌లు ర‌కాల పేర్లు వినిపిస్తుండ‌టం తెలిసిందే. తాజాగా అలాంటిదే మ‌రొక‌టి జ‌రిగింది. రాష్ట్రప‌తి రేసులో ఒక ద‌ళిత మ‌హిళ పేరు ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ద‌ళిత వ‌ర్గం మ‌హిళా నాయ‌కురాలైన ద్రైప‌తి ముర్ము పేరు వినిపిస్తోంది. రాష్ట్రప‌తి రేసులో నిల‌వ‌టానికి ఆమె ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం ఈ జులై 25తో ముగియ‌నున్న నేప‌థ్యంలో.. త‌దుప‌రి రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం ప‌లుపార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అధికార‌ప‌క్ష‌మైన ఎన్డీయే కూట‌మి వ‌ర్గాల నుంచి రాష్ట్రప‌తి ప‌ద‌విని ఆశిస్తున్న ఔత్సాహికుల సంఖ్య కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పొచ్చు.

రాష్ట్రప‌తి ప‌ద‌వి రేసులో ఎల్ కే అద్వానీ పేరు బ‌లంగా వినిపించిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ల‌భించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ఔత్సాహికులు రాష్ట్రప‌తి రేసులో త‌మ పేరు వినిపించేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పెద్దాయ‌న అద్వానీ కానీ రేసులో ఉండి ఉంటే.. అస‌లే స‌మ‌స్యా ఉండేది కాదు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ద్రౌప‌తి ముర్ము ప్ర‌య‌త్నిస్తున్నారు. తాను ద‌ళిత మ‌హిళ‌ను కావ‌టంతో త‌న‌కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆమె భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 2015 నుంచి జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె.. ఆ రాష్ట్ర తొలి మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ గా చ‌రిత్ర సృష్టించారు. గ‌తంలో ఒడిశాలోని జమ‌యూర్ భంజ్ జిల్లా బీజేపీ మ‌హిళ మోర్చా అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఆమె ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. మ‌రి.. ఆమె అభ్య‌ర్థిత్వంపై బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/