Begin typing your search above and press return to search.

జ‌మిలితో లాభాలు స‌రే.. న‌ష్టాల మాటేమిటి?

By:  Tupaki Desk   |   18 Jun 2018 4:26 AM GMT
జ‌మిలితో లాభాలు స‌రే.. న‌ష్టాల మాటేమిటి?
X
దేశ రాజ‌కీయాల్లో ఇప్పుడు అంద‌రి నోట నానుతున్న మాట జ‌మిలి ఎన్నిక‌లు. ఇంత‌కీ ఈ జ‌మిలి ఎన్నిక‌లు అంటే ఏమిటి? అన్న విష‌యాన్ని సింఫుల్ గా మూడు ముక్క‌ల్లో చెప్పాలంటే.. కొన్ని రాష్ట్రాలకు ఒక‌సారి.. మ‌రికొన్ని రాష్ట్రాల‌కు మ‌రోసారి కాకుండా.. ఎంచ‌క్కా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు.. లోక్ స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌ల్నినిర్వ‌హించ‌టం. ఎందుకిలా? అంటారా?. ఎందుకేంటి? ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌స్తుంటే.. పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌లు ఎలానో.. అధికారంలో ఉన్న పార్టీల‌కు అంత‌కు మించిన ప‌నిష్మెంట్ గా ఈ ఎన్నిక‌లు ఉంటాయి. తాము అనుకున్న నిర్ణ‌యాల్ని అమ‌లు చేయ‌టానికి ఇవి ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులు వేస్తుంటాయి.

అదే మాట‌ను చెప్పి.. ఒకేసారి ఎన్నిక‌లంటే ఎవ‌రు ఒప్పుకుంటారు చెప్పండి? అందుకే.. దానికో అంద‌మైన క‌ల‌రింగ్ ఇవ్వ‌టం మొద‌లైంది. ఒకేసారి దేశం మొత్తం ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఆ త‌ర్వాత ఎంచ‌క్కా అభివృద్ధి మీద‌నే ఫోక‌స్.. పాల‌న మీద త‌ప్పించి మ‌రే విష‌యాల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. అంతేనా.. వంద‌ల కోట్ల రూపాయిలు ఆదా చేసుకోవ‌చ్చు. వాటితో బోలెడంత అభివృద్ధి కూడా చేసుకోవ‌చ్చంటూ చాలానే మాట‌లు చెబుతున్నారు.

వంద‌ల కోట్ల రూపాయిల ఆదా అన్న‌మాట విన్నంత‌నే..మ‌న‌సు డ‌బ్బు చుట్టూ తిరుగుతూ.. నిజ‌మే క‌దా? ఎందుకంత డ‌బ్బుల్ని వృధా చేయ‌టం.. దానికి తోడు అన‌వ‌స‌ర పొలిటిక‌ల్ పొల్యుష‌న్ కంటే ఒకేసారి ద‌రిద్ర‌పు ఎన్నిక‌లు పూర్తి అయితే.. ఆ త‌ర్వాత అధికారంలో ఉన్న‌వారు తాము చేయాల్సింది చేసేస్తే.. త‌ర్వాతి ట‌ర్మ్ ఎన్నిక‌ల వ‌ర‌కూ విపక్షాలు కామ్ గా కూర్చుంటే పోలా? అంటూ సింఫుల్ గా తేల్చేసే వారు క‌నిపిస్తారు.

పోతే పోయాయి వంద‌ల కోట్లు.. తొక్క‌లో డ‌బ్బు కోసం దేశ ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ భావోద్వేగాల్ని.. త‌మ తీర్పును ఇచ్చుకునే చ‌క్క‌టి అవ‌కాశాన్ని వ‌దులుకుంటామా? అన్న మాట‌ను జ‌మిలి ఎన్నిక‌లకు అనుకూలంగా ప్ర‌చారం చేసే వారు అస్స‌లు మాట్లాడ‌రు. జ‌మిలి ఎన్నిక‌లు లేకుంటే ఎలాంటి లాభ‌మ‌న్న విష‌యాన్ని ఒక్క ఉదాహ‌ర‌ణ‌తో అంద‌రికి ఇట్టే అర్థ‌మైపోతుంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు మోడీ స‌ర్కారు ఎలా వ్య‌వ‌హ‌రించింది? త‌మ‌కు తిరుగులేద‌న్నట్లుగా మాట్లాడ‌ట‌మే కాదు..ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానివ్వండి.. మాకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారి సంగ‌తి ఒక్కొక్క‌టిగా చూస్తామ‌న్న మాట‌ను మొహ‌మాటం లేకుండా చెప్పేశారు. ఎందుకిలా అంటే.. గెలుపు ధీమా వారి చేత ఆ మాట‌ల్ని చెప్పించింది. కానీ.. క‌ర్ణాట‌క ఫ‌లితం తేడా కొట్టేస‌రికి.. ఒక్క‌సారిగా మోడీ బ్యాచ్ దూకుడు త‌గ్గింది.

అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌కు మిత్రుల అవ‌స‌ర‌మే లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన క‌మ‌ల‌నాథుల గొంతుల్లోనూ తేడా వ‌చ్చేసింది. త‌మ‌తో క‌లిసి వ‌చ్చే మిత్రుల కోసం వెదుకులాట మొద‌లైంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ క‌నిపించిన ధీమా.. బ‌డాయి మాట‌లు కాస్త త‌గ్గాయి. ఇదంతా ఎందుకు? అంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల పుణ్య‌మే. ఒక‌వేళ‌.. జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగాయే అనుకోండి. మ‌ధ్య‌లో ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. అలా లేన‌ప్పుడు ప్ర‌జ‌లు త‌మ మ‌న‌సులోని మాట‌ను చెప్పే వీలుండ‌దు. పాలించేందుకు ప్ర‌జ‌లు ప‌వ‌ర్ ఇచ్చారు కాబ‌ట్టి ఏమైనా చేసేయొచ్చ‌న్న అహంకారం ఆటోమేటిక్ గా వ‌చ్చేస్తుంది. అలాంటి దూకుడుకు క‌ళ్లెం వేసేలా అప్పుడ‌ప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల ఫ‌లితాలు ముకుతాడు వేస్తుంటాయి. అందుకే.. జ‌మిలి ఎన్నిక‌ల కార‌ణంగా ఆదా అయ్యే వంద‌ల కోట్ల‌తో పోలిస్తే.. ప్ర‌జ‌లు త‌మ భావ‌స్వేచ్ఛ ద్వారా త‌మ అభిప్రాయాన్ని చెప్పేందుకు వీలుగా ఉండే ఎన్నిక‌ల విధానాన్ని వ‌దులుకోవ‌టం అంత క్షేమ‌క‌రం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వంద‌ల కోట్ల రూపాయిల న‌ష్ట‌మ‌న్న మాట చెప్పే వారు.. అవినీతి కార‌ణంగా వేలాది కోట్ల రూపాయిలు ప‌క్క‌దారి ప‌డుతున్నాయ‌న్న విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించ‌రు? మ‌ధ్య మ‌ధ్య‌లో జ‌రిగే ఎన్నిక‌లే లేనిప‌క్షంలో.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు దాదాపు మూడు వారాల పాటు పెట్రో ధ‌ర‌ల్ని పెంచ‌కుండా నిలిపివేసే విన్యాసాలు ప్ర‌జ‌ల‌కు తెలిసే అవ‌కాశం ఉంటుందా? ప్ర‌తి వెలుగు వెనుక చీక‌టి ఉన్న‌ట్లే.. ప్ర‌తి చీక‌టి వెనుక వెలుగు ఉంటుంద‌న్న‌ది నిజం. జ‌మిలితో ఆర్థిక‌ప‌రంగా మ‌రిన్ని లాభాలు ఉండొచ్చు. కానీ.. అంత‌కు మించి విలువైన భావ‌స్వేచ్ఛ‌ను వ‌దులుకోవ‌టం ముర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఆ విష‌యం గ‌డిచిన మోడీ నాలుగేళ్ల పాల‌న‌లో దేశ ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో అర్థ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.