Begin typing your search above and press return to search.

2డీజీని డీఆర్ డీవో ఎందుకు తయారు చేసింది?

By:  Tupaki Desk   |   1 Jun 2021 8:30 AM GMT
2డీజీని డీఆర్ డీవో ఎందుకు తయారు చేసింది?
X
ఈ మధ్యన ప్రతి విషయానికి సంబంధం లేని అంశాల్ని ముడివేయటం ఎక్కువైంది. సోషల్ మీడియా.. వాట్సాప్ మాథ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి తోచినట్లు వారు.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కొన్ని ఉదంతాలకు తమ ఆలోచనల్ని జత చేసి.. అవే వాస్తవాలుగా ప్రచారం చేయటం ఎక్కువైంది. ఇందులో నిజం కంటే కూడా.. పైత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న సామెతకు తగ్గట్లుగా వీరి తీరు ఉంటోంది.

కరోనా మీద పోరాటం చేస్తున్న వేళ.. భారత రక్షణ పరిశోధన సంస్థ.. అదేనండి డీఆర్ డీవో ‘‘2డీజీ’’ డ్రగ్ ను తయారు చేయటం.. త్వరలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ద్వారా మార్కెట్లోకి తీసుకువస్తుండటం తెలిసిందే. డీఆర్ డీవో పరిశోధనలతో తయారైనది కావటంతో మీడియాలోనూ.. సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. ఈ మందు గురించి వాస్తవాల కంటే అతిశయాలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి.

స్టార్ హీరోల సినిమాలపై ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో.. తాజాగా 2డీజీ డ్రగ్ మీదా అలాంటి అంచనాలే ఉన్నాయి. దీంతో.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా దీనిపై కామెంట్ చేస్తున్నారు. కొందరు అతిగాళ్ల పుణ్యమా అని.. ఈ డ్రగ్ ను డీఆర్ డీవో బయోవార్ ను ముందే ఊహించి.. పదేళ్ల క్రితమే తయారు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వాదనలు తప్పని తేల్చారు డీఆర్ డీవో చీఫ్ సతీశ్ రెడ్డి. సైనికులపై రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండేందుకు పదేళ్లుగా ప్రయోగాలు చేసిన ఈ పౌడర్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు.

అంతేకాదు.. కొవిడ్ నియంత్రణలో ఇది పని చేస్తుందని నమ్మినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో ప్రయోగించి.. మంచి ఫలితాలు వచ్చిన తర్వాతే అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ మందు అన్ని రకాల స్ట్రెయిన్లు.. వైరల్ ఇన్ ఫెక్షన్ పై పని చేస్తుందన్నారు.

కొవిడ్ తీవ్ర.. మధ్యస్థ స్థాయిల్లో ఉన్న వారికి ఇస్తున్నారని.. స్వల్ప లక్షణాలు ఉన్న వారికీ వాడేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచి ముడి పదార్థాన్ని మరికొన్ని సంస్థలకు ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పారు. వారంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచి 6-8 లక్షల 2డీజీ పౌడర్ పొట్లాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.