Begin typing your search above and press return to search.

ఆ మూడు తప్పులు చేయకుంటే 5గురు బతికేవారు

By:  Tupaki Desk   |   26 May 2016 10:19 AM GMT
ఆ మూడు తప్పులు చేయకుంటే 5గురు బతికేవారు
X
నిన్న టీవీలు చూసినోళ్లు.. ఈ రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లు చూసిన వాళ్లను ఒక వార్త విపరీతంగా ఆకర్షించి ఉంటుంది.  రెండు లారీల మద్య కారు ఇరుక్కుపోయిన దారుణ ఉదంతంలో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వార్త విన్న వెంటనే.. రెండు పెద్ద లారీల మధ్య చిన్న కారు ఇరుక్కుపోయిన దృశ్యాలు చూసినంతనే లారీ డ్రైవర్ల మీద కోపం రావటం ఖాయం. అదే సమయంలో ఈ ఉదంతం గురించి విన్న వారంతా అయ్యో అనుకోవాల్సిందే.

పిల్లల్ని కాలేజీల్లో చేర్చేందుకు వెళుతున్న ఒక తండ్రి.. అతని స్నేహితుడు మరణించిన ఈ ఉదంతం అసలు ఎలా జరిగింది? అంత ఘోర ప్రమాదానికి బాధ్యలు ఎవరు? అన్న ప్రశ్నలు వేసుకుంటే షాకింగ్ సమాధానాలు వస్తాయి. ఎందుకంటే.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. రూల్స్ కు భిన్నంగా వ్యవహరించిన వైనం.. అంతులేని నిర్లక్ష్యమే ఐదుగురు చనిపోవటానికి కారణంగా చెప్పాలి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ చేసిన మూడు తప్పులే ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది.

జాతీయ రహదారి మీద వాహనాన్ని నడిపే సమయంలో ఎంత జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ ప్రమాదం చెబుతుంది.  నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ చౌరస్తాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారు డ్రైవింగ్ చేసిన ప్రవీణ్ కుమార్ మూడు తప్పులే కారణంగా చెప్పొచ్చు. వేగంగా వెళుతున్న భారీ లారీకి ఎడమ వైపు అంతే వేగంగా ఆల్టో కారును నడపటం.. ఒక చౌరస్తాలో ఒకేసారి రెండు వాహనాలు కుడివైపునకు తిరగటం.. అదే సమయంలో అవతలి లైన్ నుంచి మరో భారీ లారీ రావటంతో రెండు లారీల మధ్య చిక్కుకుపోయిన కారు చితికిపోయింది. ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే.. కారును అజాగ్రత్తగా నడపటమే ప్రమాదానికి కారణమని చెప్పాలి. కారును నడిపే సమయంలో ప్రవీణ్ కుమార్ సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. టేక్రియాల్ చౌరస్తా వద్ద కామారెడ్డి వైపునకు వెళ్లాల్సిన కారు.. సెల్ లో మాట్లాడుతున్న నేపథ్యంలో వెనుక నుంచి వస్తున్న లారీని గుర్తించటంలో జరిగిన పొరపాటు ఈ ప్రమాదానికి కారణంగా చెప్పొచ్చు. అందుకే.. కారును నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించటంతో పాటు.. మితిమీరిన వేగంతో నడపకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ దారుణ ప్రమాదంలో జరిగిన మూడు తప్పులు చూస్తే..

1.        డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం

2.        పక్క నుంచి వెళుతున్న భారీ వాహనాన్ని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయటం

3.        అలా ఓవర్ టేక్ చేసిన కారును అంతే వేగంతో అవతల లేన్ దాటి కుడివైపునకు తిప్పటం