Begin typing your search above and press return to search.

గౌతమ్ రెడ్డి మరణంపై మంత్రి డ్రైవర్ మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 AM GMT
గౌతమ్ రెడ్డి మరణంపై మంత్రి డ్రైవర్ మాటలు విన్నారా?
X
రోటీన్ రోత రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. మచ్చలేని నేతగా గుర్తింపు పొందటమే కాదు.. సొంత పార్టీ నేతల అభిమానమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు సైతం గౌరవించే వ్యక్తిత్వం మంత్రి స్వర్గీయ గౌతమ్ రెడ్డి సొంతం. అలాంటి ఆయన 50 ఏళ్ల వయసులో అనూహ్యంగా మరణించిన తీరు ప్రతి ఒక్కరిని వేదనకు గురి చేస్తోంది. ఎక్కువ సమయం లేకుండానే ఆయన ఏదో హడావుడి పని ఉన్నట్లు వెళ్లిపోయిన వైనాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు గౌతమ్ రెడ్డి కారు డ్రైవర్ నాగేశ్వరరావు.

గౌతమ్ రెడ్డి వద్ద దాదాపు 19 ఏళ్ల నుంచి ఆయన కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. 2003 నుంచి డ్రైవర్ గా పని చేస్తున్నా.. ఏనాడు తనను పని వాడిగా చూసింది లేదని.. ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానని అభయమిచ్చే ఆయన కళ్ల ముందు వెళ్లిపోయిన వైనాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సోఫాలో కూర్చున్న ఆయన.. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారని.. గట్టిగా పిలవటంతో కింద ఉన్న తాను పరిగెత్తుకుంటూ పైకి వెళ్లానని.. అప్పటికే ఆయన కింద పడి ఉన్నట్లు చెప్పారు.

కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తానని.. మంచినీళ్లు అడిగారని.. తెచ్చినా తాగలేదన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు లిఫ్టు దగ్గరకు తెచ్చేసరికే నాలుక మడత పడిందన్నారు. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని.. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చామని.. కారులో ఏమీ మాట్లాడలేదని.. శ్వాస మాత్రం ఉందన్నారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు జిమ్ కు వెళ్లాల్సి ఉందని.. అంతలోనే ఇదంతా జరిగిందన్నారు. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్ కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి వచ్చామని.. సారు మాకు దేవుడు లాంటి వాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. కళ్ల ముందు కరిగిపోయిన చందంగా.. ఫిట్ గా ఉండే గౌతమ్ రెడ్డి మరణించిన తీరు అందరిని కలిచివేస్తోంది.