Begin typing your search above and press return to search.

డ్రగ్స్ ముఠా .. అలవాటయ్యే వరకు తక్కువే , ఆ తర్వాత !

By:  Tupaki Desk   |   21 Oct 2021 6:31 AM GMT
డ్రగ్స్ ముఠా .. అలవాటయ్యే వరకు తక్కువే , ఆ తర్వాత !
X
గంజాయి సంబంధిత ద్రవ పదార్థమైన హష్‌ ఆయిల్‌ విక్రయంలో ఓ ముఠా కొత్త ఎత్తు వేసింది. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్న వీళ్లు..ఈ మత్తుకు అలవాటు పడేవరకు వారికి తక్కువ రేటుకు అమ్మారు. బానిసలుగా మారిన తర్వాత భారీ రేటు కట్టి విక్రయించారు. ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు.

సనత్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మహబూబ్‌ అలీ వృత్తిరీత్యా డ్రైవర్‌ అయినప్పటికీ నేర చరితుడు. మాదాపూర్‌ లో రెండు దోపిడీ, మరో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సార్‌ నగర్‌ లో డ్రగ్స్‌ కేసు ఇతడిపై నమోదై ఉన్నాయి. గంజాయి, హష్‌ ఆయిల్‌ వినియోగానికి బానిసగా మారిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హష్‌ ఆయిల్‌ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని భావించాడు. ఈ ఆలోననను తన స్నేహితులైన సనత్‌ నగర్‌ వాసులు మహ్మద్‌ సర్ఫ్‌రాజ్, మహ్మద్‌ హాజీ పాషాలకు చెప్పడంతో వాళ్లూ జట్టుకట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ త్రయం ఆంధ్రప్రదేశ్‌ లోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లింది.

అక్కడి వెంకట్‌ అనే వ్యక్తి నుంచి హష్‌ ఆయిల్‌ ఖరీదు చేసుకువచ్చింది. తన స్నేహితులు, పరిచయస్తులైన వారికి తక్కువ రేటుకు అమ్మడం మొదలెట్టింది. వారి ద్వారా పరిచయమైన వారికీ ఈ మాదకద్రవ్యం విక్రయించింది. అలా వారిని ఈ మత్తుకు బానిసలుగా మార్చేసిన తర్వాత హష్‌ ఆయిల్‌ రేటును అమాంతం పెంచేసి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. హైదరాబాద్‌ తో పాటు సైబరాబాద్‌ పరిధిలోని వారికీ దీన్ని విక్రయిస్తోంది. ఇప్పుడు వీళ్లు వెళ్లాల్సిన పని లేకుండా ఆర్డర్‌ చేస్తే చాలా వెంకట్‌ వివిధ రకాలుగా పార్శిల్‌ చేసి పంపిస్తున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థకియుద్దీన్, కె.చంద్రమోహన్‌ వలపన్నారు. బంజారాహిల్స్‌ ప్రాంతంలో హష్‌ ఆయిల్‌ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 205 చిన్న బాక్సుల్లో ఉన్న 1.02 లీటర్ల హష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకట్‌ కోసం గాలిస్తున్నారు