Begin typing your search above and press return to search.

మద్యం మత్తులో చెట్టుకు కట్టేసి దారుణం..

By:  Tupaki Desk   |   6 Aug 2018 8:45 AM GMT
మద్యం మత్తులో చెట్టుకు కట్టేసి దారుణం..
X
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అక్రమ సంబంధాలు - మద్యం తాగడాన్ని మానేయాలని అన్నందుకు ఏకంగా భార్యను సజీవ దహనం చేశాడు. ఈ అమానవీయ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో చోటు చేసుకుంది.

ఖానాపూర్ మండలం భూపతిపుటకు చెందిన బానోత్ రజిత (28)ను 9 ఏళ్ల కిత్రం పర్వతగిరి మండలం తూర్పుతండాకు చెందిన బానోత్ బాలుకు ఇచ్చి వివాహం చేశారు. బాలు, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు.. కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. అనంతరం బాలు చెడు అలవాట్లకు బానిససయ్యాడు. అదే గ్రామానికి చెందిన బంధువు అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా నిత్యం మద్యం తాగి వచ్చి రజితతో గొడవకు దిగేవాడు. మహిళతో అక్రమ సంబంధం బయటపడి కేసు నమోదై జైలుకు కూడా వెళ్లి బెయిల్ పై వచ్చాడు. ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి 12గంటలకు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దీనిపై భార్య రజిత నిలదీయడంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే భయపడి పారిపోతున్న రజితను ఇంటిపక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పటించాడు. అరుపులు - కేకలు వినపడకుండా ఆమె నోట్లో గుడ్డ నొక్కాడు. మద్యం మత్తు కాస్త దిగడంతో భార్యను కాపాడే ప్రయత్నంలో బాలు చేతులు, కాళ్లు కాలిపోయాయి.

మంటలు రావడంతో తేరుకున్న చుట్టుపక్కల వారు రజితను కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం 108లో ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపుల వల్లే ఇలా మద్యం తాగి మగవారు ఆకృత్యాలకు పాల్పడుతున్నారని.. బెల్ట్ షాపులు మూసివేయాలని ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.